కుర్చీ లేదు గిర్చీ లేదు... కింద కూర్చొని రాసుకో...
నమస్తే మేడం, నమస్తే సార్ మేము ప్రభుత్వం నుండి వచ్చాము...
దిశ, కుత్బుల్లాపూర్ : నమస్తే మేడం, నమస్తే సార్ మేము ప్రభుత్వం నుండి వచ్చాము... సమగ్ర కుటుంబ సర్వే కోసం మీ వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చాము మేడం... మాకు సహకరించండి.... అంటూ నిజాంపేట్ లో సర్వే సిబ్బంది ప్రజలను బతిమిలాడుతూ విధులు చేపడుతున్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 31,32 వార్డులలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న సర్వే సిబ్బందిని ప్రజలు అవమానించి పంపుతున్నారు.
మంగళవారం నిజాంపేట్ రాజీవ్ గృహకల్పలో సమగ్ర కుటుంబ సర్వే కోసం ఎన్యూమరేటర్ ఓ ఇంటికీ వెళ్లి మేడం కొంచం కుర్చీ ఇస్తారా కూర్చొని మీ వివరాలు రాసుకుంటాం...అని అడగగా ఆమెను ఆ కుటుంబ సభ్యులు కసురుకున్నారు. కుర్చీ లేదు... గిర్చీ లేదు...కింద కూసోని రాసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆమె చేసేది లేక నేలపై కూర్చొని కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకుని వచ్చారు. ఇలా కొందరు ప్రజలు సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్ అధికారులపై చిన్న చూపు చూడడంపై సర్వే సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.