స్కాములు లేని పాలన బీజేపీతోనే సాధ్యం

స్కాములు లేని పాలన బీజేపీతోనే సాధ్యం అని, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదుపై నేతలు దృష్టి సారించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-11-22 14:04 GMT

దిశ, మల్కాజిగిరి : స్కాములు లేని పాలన బీజేపీతోనే సాధ్యం అని, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సభ్యత్వ నమోదుపై నేతలు దృష్టి సారించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మల్కాజిగిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, సభ్యత్వనమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

    ఎంపీతో పాటు తల్లోజు ఆచారి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకరా్ , మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ వర్క్ షాపులను కేవలం మొక్కుబడిగా చేయవద్దని, ప్రజాప్రతినిధి కావాలి అనుకొనేవారే మీటింగ్ కి రాకపోతే ఎలా అని అన్నారు. రాజకీయ నాయకుడికి పని గంటలతో సంబంధం లేకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ నాయకుల భాగస్వామ్యం లేక పార్టీ ముందుకు వెళ్లదని, స్థానికబలం లేకపోతే పార్టీ బలపడలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దేశరక్షణ, అభివృద్ధి మీద ఆధారపడి జరుగుతాయన్నారు.

     కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే బూత్​ కమిటీలు పటిష్టంగా ఉండాలని, పార్టీ మీద కమిట్మెంట్, ప్రజలతో సంబంధం, పనిచేసే గుణం, సమర్ధత ఉన్నవారికే కమిటీ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మండల, డివిజన్ అధ్యక్షులు పూర్తి సమయం కేటాయించే వారికే ఇవ్వాలన్నారు. పాతనాయకులకు, సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలన్నారు. పార్టీ నేతలందరూ తప్పకుండా ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో 3.65 లక్షల సభ్యత్వం పూర్తయిందని, కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో సభ్యత్వం అనుకున్న స్థాయిలో జరగలేదన్నారు.

    జీఎచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎగిరేది కషాయజెండానేనన్నారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్, ఎంఐఎంతో బీజేపీ పొత్తు ఉండదని, మనమే సొంతంగా ఎదగాలన్నారు. ప్రాంతీయ పార్టీల్లో నాయకుడు ఖతం అయితే పార్టీ ఖతం అవుతుందని, కానీ జాతీయ పార్టీలలో పార్టీ ఫస్ట్ అనే విధానం ఉంటుందన్నారు. ఎంపీగా గెలిచిన రోజు నుండి నేను మీ వెంటనే ఉంటున్నా అన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, మీసాల చంద్రయ్య, భాను ప్రకాష్, సూర్య రావు, వీకే మహేష్, వాసంశెట్టి శ్రీనివాస్, నరహరి తేజ పాల్గొన్నారు. 


Similar News