అదృశ్యమైన విద్యార్థినులు సూర్యలంక బీచ్​లో ప్రత్యక్షం

ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన విషయం తెలిసిందే.

Update: 2024-11-21 16:02 GMT

దిశ, కూకట్ పల్లి : ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన విషయం తెలిసిందే. వీరు చీరాలలోని సూర్యలంక బీచ్​లో ప్రత్యక్షం అయ్యారు. రోజు వారి మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన వీరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గురువారం కూకట్​పల్లి పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విద్యార్థినుల స్నేహితులతో వాకబు చేయగా సూర్యలంక బీచ్​కు వెళ్లాలని రెండు మూడు రోజులుగా డిస్కస్​ చేసుకుంటున్నారని తెలిసింది.

     దీంతో పోలీసులు సూర్యలంక పోలీసులను అప్రమత్తం చేశారు. కూకట్​పల్లి నుంచి ఒక టీంను సూర్యలంకకు పంపించినట్టు ఏసీపీ శ్రీనివాస్​ రావు, సీఐ కొత్తపల్లి ముత్తులు మీడియాకు వివరించారు. విద్యార్థినులు ఇద్దరూ సూర్యలంకలో పోలీసులకు కనిపించారు. ఇద్దరు విద్యార్థినులను నగరానికి తీసుకు వచ్చేందుకు పోలీసులు ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు.

అసలేం జరిగింది...

జగద్గిరిగుట్టకు చెందిన లక్ష్మీ దుర్గా( 13), బాలాజీనగర్​కు చెందిన హారిక (13)లు ఇద్దరూ కూకట్​పల్లి వివేకానందనగర్​ కాలనీలోని చైతన్య టెక్నో స్కూల్​లో 8వ తరగతి చదువుతున్నారు. కాగా ఇద్దరూ గత కొంత కాలంగా చీరాలలోని సూర్యలంక బీచ్​కు వెళ్లాలని, అక్కడ రూం తీసుకుని రెండు రోజులు ఎంజాయి చేయాలని క్లాస్​ రూంలో తమ స్నేహితులతో డిస్కస్​ చేసుకుంటూ ఉండే వారు. అంతే కాకుండా లక్ష్మీ దుర్గా కుటుంబానిది సూర్యలంక సమీపంలోని గ్రామం కావడంతో ఎలాగైనా అక్కడికి వెళ్లాలని ప్లాన్​ చేసుకున్నారు. రోజు వారి మాదిరిగానే బుధవారం ఇంటి నుంచి స్కూల్​కు బయలు దేరిన లక్ష్మీ దుర్గా, హారికలు తమతో పాటు స్కూల్​ బ్యాగ్​లో సివిల్​ డ్రెస్​ తీసుకు వచ్చారు.

    రోజు వారి మాదిరిగానే సాయంత్రం 4:26 నిమిషాలకు స్కూల్​ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు స్కూల్ పరిసరాలలో సంచరిస్తూ డ్రెస్​ మార్చుకోవడానికి అనువైన చోటును వెతికారు. కొద్ది దూరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న వాచ్​మెన్​తో వాష్​రూంకు వెళ్లాలంటూ రెక్వస్ట్​ చేశారు. దీంతో వాచ్​మెన్​ భార్య వారిని బాత్​రూం వినియోగించుకునేందుకు పర్మిషన్​ ఇచ్చింది. దీంతో ఇద్దరు బాత్​రూంకు వెళ్లి తమ వెంట తెచ్చుకున్న సివిల్​ డ్రెస్​లను మార్చుకుని అక్కడి నుంచి వెళ్లి పోయారు.

    లక్ష్మీదుర్గా తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్కూల్​ నుంచి బయటికి వస్తున్నప్పటి నుంచి కొద్ది దూరం వరకు ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయిన సీసీ ఫూటేజీలో స్కూల్​ నుంచి వచ్చి, డ్రెస్​లు మార్చుకుని వెళ్లే వరకు వీడియోలు బయటికి వచ్చాయి. క్లాస్​ రూంలో స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు సూర్యలంక బీచ్​ వద్దకు వెళ్లి ఉండవచ్చునని కూకట్​పల్లి పోలీసులు సూర్యలంక పోలీసులను సంప్రదించి అక్కడి హోటల్​లు, బీచ్​ పరిసరాలలో గాలించారు. లక్ష్మీ దుర్గా, హారికలు ఇద్దరు పోలీసులకు చిక్కారు.

ఇన్​స్ట్రాగ్రామ్​లో...

లక్ష్మీ దుర్గా, హారికలు ఇన్​స్ట్రా గ్రామ్​లో యాక్టీవ్​గా ఉండే వారు. సూర్యలంకకు చెందిన ఓ అబ్బాయితో పరిచయం అయింది. వీరిద్దరూ అక్కడికి వెళ్లిన తరువాత ఓ అబ్బాయిని కలిసి సూర్యలంక బీచ్​లో దిగిన ఫోటోలు ఇన్​స్ట్రాగ్రామ్​​లో పోస్ట్​ చేయడం, చాటింగ్​ చేయడంతో వారిద్దరు సూర్యలంక బీచ్​ వద్ద ఉన్నట్టు పోలీసులు నిర్ధారించుకున్నట్టు తెలుస్తుంది.


Similar News