ముహుర్తం కుదిరింది..ఈ నెల 6న చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఈ నెల 6న ప్రారంభించనున్నారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఈ నెల 6న ప్రారంభించనున్నారు. అధునిక హంగులతో నిర్మించిన ఈ స్టేషన్ తో జంటనగరాల రైల్వే ప్రయాణికులకు రవాణా సేవలు సులభతరం కానున్నాయి. రూ.430 కోట్ల వ్యయంతో ఈ టర్మినల్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే డిసెంబర్ 28నే ఈ టర్మినల్ ను రైల్వే మంత్రి అశ్విన్ వైష్టవ్ ప్రారంభించాల్సి ఉన్నా మాజీ ప్రధాని మన్మోహన్ మృతి చెందడంతో కార్యక్రమం వాయిదా పడింది.
నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లపై భారం తగ్గించేలా చర్లపల్లి స్టేషన్ ను నిర్మించారు. ఇక్కడి నుంచి 25 ప్రధాన రైళ్లు రాకపోకలు సాగించేలా నిర్ణయించారు. అంతర్జాతీయ విమానాశ్రయ హంగులతో చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రయాణికులకు అందుబాటులో కి వస్తోంది. హైదరాబాద్ - సికింద్రాబాద్ రైల్వే లో చర్లపల్లి రైల్వే స్టేషన్ అద్బుతమైన టర్మినల్ గా ఆవిష్కారం కానుంది.
ఎయిర్ పోర్టు తరహా వసతులు..
ఈ టర్మినల్ లో ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిప్టులు, ఆరు బుకింగ్ కౌంటర్లు, పురుష- మహిళా ప్రయాణికుల కోసం వేర్వేరు వెయిటింగ్ హాళ్లు రూపొందించారు. అదే విధంగా హైక్లాస్ వెయిటింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. విమానాశ్రయాల తరహాలో ఎగ్జిక్యూటివ్ లాంజ్ లు సిద్దం చేశారు. తొలి అంతస్తులో కెఫెటేరియా .. రెస్టారెంట్ వంటి సౌకర్యాలను కల్పించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధునిక సాంకేతికత వినియోగించి కొత్త డిజైన్లలో ప్రకాశవంతమైన లైటింగ్‌తో ఎలివేషన్ తీర్చిదిద్దారు.
చర్లపల్లికి ప్రయాణికుల రాకపోకల కోసం కుషాయిగూడ, చంగిచర్ల డిపో ల నుంచి నిరంతరం బస్సులు నడిపేలా కసరత్తు జరుగుతోంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ లు నేరుగా పాల్గొంటారు. ప్రధాని మోడీ మాత్రం వర్చువల్‌గా హాజరై రైల్వే టెర్మినల్‌ను ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు.