సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

సర్వే వివరాలను ముందుగానే కుటుంబాలకు తెలిపి, అవసరైన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ సూచించారు.

Update: 2024-11-13 14:16 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : సర్వే వివరాలను ముందుగానే కుటుంబాలకు తెలిపి, అవసరైన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ సూచించారు. బుధవారం మేడ్చల్ కలెక్టరేట్ హాల్ లో కుటుంబ సర్వే, ధాన్య సేకరణ అంశాలపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తో కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో దివ్యా దేవరాజన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అందుబాటులో లేని కుటుంబ సభ్యులకు ముందుగానే సర్వే సమయాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను అందుబాటులో పెట్టు కునేలా ఎన్యుమరేటర్ల ద్వారా ఇంటింటికి తెలిపేందుకు చర్యలు తీసుకోవాలని సర్వే నోడల్ అధికారులకు సూచించారు.

    ఎన్యుమరేటర్లు డాక్యుమెంట్లు చూసి తప్పులు జరుగకుండా ప్రొఫార్మాలను పూరించాలని అన్నారు. ఏదైనా సందేహం ఉంటే సూపర్ వైజర్, నోడల్ అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ చేసుకొని సర్వే నిర్వహించాలన్నారు. ఈ జిల్లాలో వలసదారులు ఎక్కువగా ఉన్నందున వారు స్వచ్ఛందంగా కోరిన చోట నమోదు చేయించాలన్నారు. ఎన్యుమరేటర్లు కుటుంబ సభ్యులతో సౌమ్యంగా మాట్లాడి సమాధానాలు తెలుసుకుంటూ, ప్రత్యక్షంగా పరిశీలించిన అంశాలను ప్రొఫార్మాలో కొంత వరకు పూరించాలని అన్నారు. సర్వే నిర్వహణలో కలిగే సమస్యలను నోడల్ అధికారులు చొరవ తీసుకొని పరిష్కరించాలన్నారు. అంతకు ముందు జిల్లా నోడల్ అధికారులతో తమ పరిధిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

     సర్వేలో ఎదురయ్యే ఇబ్బందులను, సమస్యలను నోడల్ అధికారులతో అడగి తెలుసుకున్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమగ్ర సమాచారాన్ని ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సవివరంగా వివరించారు. జిల్లాలో గ్రూప్ -3 పరీక్షలు ఉన్నందున, సర్వే పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం అవసరమవుతుందని కలెక్టర్​ తెలిపారు.

     ఈ సమవేశంలో జిల్లా అదనపు కలెక్టర్​ విజయేందర్ రెడ్డి, ఆర్డీఓలు సైదులు, శ్యాం ప్రకాష్, డీఆర్డిఓ సాంబశివరావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖధికారి స్వర్ణలత, జిల్లా వ్యవసాయ శాఖాధికారి చంద్రకళ, జిల్లా పౌర సరఫరా డీఎం సుగుణబాయి, జిల్లా యువజన అధికారి గోపాల్ రావు, జిల్లా మత్స్య శాఖ అధికారి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి ప్రశాంత్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాబు మోసిస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను పరిశీలించి, పదార్థాలను రుచి చూశారు. 


Similar News