జైళ్ల శాఖ చరిత్రలో మైలురాయి.. రాష్ట్ర వ్యాప్తంగా 213 ఖైదీల విడుదల

తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులకు ప్రభుత్వం స్పందించింది.

Update: 2024-07-03 14:38 GMT

దిశ, కాప్రా, ఉప్పల్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులకు ప్రభుత్వం స్పందించింది. ఇందులో జైలు గోడల మధ్య ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలంటూ వచ్చిన అర్జీలకు ప్రభుత్వం స్పందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ప్రకారం.. ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ ద్వార గవర్నర్ అమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా 213 మంది ఖైదీల విడుదలకు ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు జైళ్ల శాఖ డీజి సౌమ్య మిశ్రా తెలిపారు. బుధవారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీల విడుదల సందర్భంగా ఖైదీలకు మార్గదర్శకం, ఉపాధి కల్పన కార్యక్రమాన్ని నిర్వహించారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగ నియామక పత్రాలను, మహిళలకు కుట్టు మిషన్ లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అకెళ్ళ రాఘవేంద్ర, ప్రముఖ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ జాస్తి రాజేశ్వరిలు, కౌన్సిలింగ్ నిర్వహించారు. విడుదలైన వారిలో 205 మంది జీవిత ఖైదీలు, 8 మంది దీర్ఘకాలిక శిక్ష విధించబడిన ఖైదీలు, 35 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించిన గవర్నర్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హోం సెక్రటరీ జితేందర్ కుమార్ కు డీజీ ధన్యవాదాలు తెలిపారు. ఖైదీలు జైల్లో ఉన్న రోజుల్లో వివిధ రంగాల్లో వృత్తి విద్యా శిక్షణ, విద్యాభ్యాసం పొందారని, వారు ఆ శిక్షణ ఉపయోగించుకొని విడుదల అనంతరం జీవితంలో సంతోషంగా జీవించాలని, సమాజం పట్ల బాధ్యతతో నేరరహిత జీవితం గడపాలని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ హైదరాబాద్ రేంజ్ డాక్టర్ శ్రీనివాస్, విడుదలవుతున్న ఖైదీలచే సత్ప్రవర్తనతో చట్టాలకు లోబడి జీవిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ జాబ్ మేళాలో జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మైనేషన్ ఫ్యూయల్ స్టేషన్లలో, పరిశ్రమలలో పనిచేయడానికి 70 మంది విడుదలవుతున్న ఖైదీలకు జాబ్ ఆఫర్ లెటర్ జైళ్ల శాఖ నుంచి డిజి డాక్టర్ సౌమ్య మిశ్రా అందజేశారు. ఈ సందర్భంగా జైళ్ళ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ అడ్మిన్ వై రాజేష్ , వెల్ఫేర్ ఐజీ ఎన్ మురళి బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.సంపత్ లు ఖైదీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కారాగారం హైదరాబాద్ పర్యవేక్షణాధికారి నవాబ్ శివకుమార్ గౌడ్, మహిళా జైల్ పర్యవేక్షణాధికారి లక్ష్మీ గోపీనాథ్, వరంగల్ ఓపెన్ జైలు పర్యవేక్షణాధికారి కళాసాగర్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా చర్లపల్లి జైలు పర్యవేక్షణాధికారి సంతోష్ కుమార్ రాయ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జైళ్లకు చెందిన అధికారులు, సిబ్బంది, ఖైదీల బందువులు పాల్గొన్నారు.

చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ధ కోలాహలం..

ఖైదీల విడుదల సందర్భంగా చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ధ ఖైదీల కుటుంభసభ్యులు, వివిధ జైళ్ల నుంచి వచ్చిన ఖైదీలతో సందడి నెలకొంది. ఖైదీలు తమ సొంతింటికి వెళ్తున్న సంబరాలతో పండగ వాతావారణం నెలకొంది . ఖైదీల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి జైలు గొడల మధ్య గడిపిన తాము జనజీవన స్రవంతిలో కలువబోతున్న ఆనందాలు అవధులు దాటాయి.

వివిధ కారగారాల నుండి విడుదలైన ఖైదీల వివరాలు...

1. కేంద్ర కారాగారం చర్లపల్లి 61

2. కేంద్రకారకారం హైదరాబాద్ 27

3. కేంద్ర కార్యాలయం వరంగల్ 20

4. ఖైదీల వ్యవసాయ క్షేత్రం చర్లపల్లి 31

5. ప్రత్యేక మహిళా కారాగారం హైదరాబాద్ 35

6. కేంద్ర కారాగారం సంగారెడ్డి 1

7. కేంద్ర కారాగారం నిజామాబాద్ 15

8. జిల్లా జైలు మహబూబ్నగర్ 02

9. జిల్లా జైలు ఆదిలాబాద్ 03

10. జిల్లా జైలు కరీంనగర్ 7

11. జిల్లా జైలు ఖమ్మం 04

12. స్పెషల్ సబ్ జైల్ ఆసిఫాబాద్ 03

13. డిస్టిక్ జైల్ నల్గొండ 04

మొత్తం 213.


Similar News