Panchayat Elections: రిజర్వేషన్లపై టెన్షన్, టెన్షన్.. మొదలైన ఎన్నికల సందడి
స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది.
దిశ, మేడ్చల్ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. పోటీకి ఆసక్తి చూపుతున్న వారు పలకరింపులు.. అభయ హస్తాలతో ముందుకు సాగుతున్నారు. సంక్రాంతికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఫిబ్రవరి 2వ వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడంతో ఆశావాహులు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
మేడ్చల్ జిల్లాలో 2019లో 61 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలో 28 గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. మిగితా 33 గ్రామ పంచాయతీలతోపాటు కొత్తగా ఏర్పడిన ఘన్ పుర్ పంచాయతీతో కలిపి 34 గ్రామాలు, 320 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వేషన్ల దామాషా ఖరారుపై బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. అయితే ఈసారి పాత రిజర్వేషన్లు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా..? కొత్తగా రిజర్వేషన్లు మారుస్తారా..? అనే దానిపై ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. బీసీ కమిషన్ సేకరిస్తున్న వివరాల ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తారని చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గ్రామాల్లో ఉన్న సామాజిక వర్గాలను బట్టి రిజర్వేషన్లపై అంచనా వేసుకుంటున్నారు.
అన్నీ కలిసొస్తో జనవరి 14వ తేదీన( సంక్రాంతి రోజున) స్థానిక ఎన్నికల నోటీఫికేషన్ వస్తోందని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం కాగా, రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. ఆ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్న క్రమంలో ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు కలిసొస్తే పోటీ చేయాలన్న సంకల్పంతో ఉన్న ఆశావహులు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
కుదిరితే జంప్..
స్థానిక సంస్థల సమరం సమీపిస్తుండడంతో నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్న పార్టీలోనే కొనసాగాలా..? పక్క పార్టీలోకి జంప్ చేయాలా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. కొందరు పార్టీతో పనిలేకుండా ఓటర్లను పలకరిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇకపోతే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఆ పార్టీలోని నాయకుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై జోష్ పెరిగింది. జిల్లాలో గత పాలక వర్గాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అత్యధిక సంఖ్యలో గులాబీ పార్టీకి చెందిన వారే గెలుపొందారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి గెలుపొందిన తర్వాత గులాబీ పార్టీలో చేరారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో గతంలో బీఆర్ఎస్ కు వెళ్లిన వారు సొంత గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలపై ఆశలు పెంచుకొని పార్టీ పెద్దల మద్దతు కూడ గట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారు ఈ సారి తమకు పదవీ యోగం ఉంటుందనే ఆశతో ఉన్నారు.