గెలిచేంతవరకు ఒక మాట, గెలిచాక మరొక మాటగా కాంగ్రెస్ తీరు : ఈటల

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంతో అబద్ధపు మాటలు చెప్పి

Update: 2024-05-10 12:53 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంతో అబద్ధపు మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఓటర్లకు మాయమాటలు చెప్పి గెలిచేంతవరకు ఒక మాట గెలిచినాక మరొక మాటగా కాంగ్రెస్ తీరు ఉన్నదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఆయన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి ఓటర్లే కాకుండా దేశంలో ఉన్న ఓటర్లు అందరూ మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలలో ఓటు వేస్తే అది వృధానే అవుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు కృషి చేస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితిలో ఓటర్లు లేరని తెలిపారు. మహిళలకు రూ. రెండు వేల ఐదు వందలు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ, వృద్ధులకు 4వేలు, వికలాంగులకు 6వేలు పెన్షన్ ఇస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నెరవేర్చకుండా విఫలమయ్యారని గుర్తు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో ఏ సమస్య ఉన్న పరిష్కరించే బాధ్యత తనదని మే 13న జరగబోయే ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


Similar News