త్రిబుల్ ఆర్ రీజినల్ రింగుకు హద్దులు నాటిన అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అదనంగా స్థలాన్ని సేకరిస్తున్నారు అధికారులు.
దిశ,చౌటుప్పల్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అదనంగా స్థలాన్ని సేకరిస్తున్నారు అధికారులు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని హెచ్ఎండిఏ వెంచర్లో అదనంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సుమారు 83 ఎకరాల భూమిని సేకరించి హద్దులు నాటారు. బాధితులు ఆందోళన చేస్తారన్న ముందస్తు సమాచారంతో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, పోచంపల్లి పోలీస్ స్టేషన్ సహకారంతో భారీగా పోలీసుల బందోబస్తుతో హద్దులు నాటారు. ప్లాట్లు కొల్పోతున్న బాధితులను హద్దు లోపలికి రానివ్వకుండా పోలీసులు భారీగా మోహరించారు.
దీంతో ఫ్లాట్ల యజమానులు పోలీసులతో కొద్ది సేపు వాగ్వివాదానికి దిగారు. స్థానిక రెవెన్యూ అధికారులుతో మాట్లాడిన తర్వాతే హద్దురాళ్లాను నాటాలని తెలపడంతో చౌటుప్పల్ ఎమ్మార్వో సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. ముందస్తు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం రింగు రోడ్డు పోతుందని తెలిసి మా ఇళ్ల స్థలలాను, బంగారం అమ్ముకొని ప్లాట్లు కొనుగోలు చేశామని ఇప్పుడు వాటిని తీసుకుంటే తీవ్రంగా నష్టపోతామని బాధితులు ఎమ్మార్వో తో వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో వెనుతిరిగారు.