కేసీఆర్ చేసిన అవినీతి ఎవ్వరూ చేయలేదు
కేసీఆర్ చేసిన అవినీతి సమైక్య రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆరోపించారు.
దిశ, కూకట్పల్లి : కేసీఆర్ చేసిన అవినీతి సమైక్య రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆరోపించారు. గురువరం గాంధీ భవన్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి మీద రూ.రెండు లక్షల అప్పు కావడానికి కారణం కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో 80 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. తొమ్మిది నెలల్లోనే రూ. 80 వేల కోట్ల అప్పులు చేశారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దొంగే దొంగదొంగ అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ది కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మిగులు బడ్జెడ్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పై చిలుకు అప్పులు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు అయితే దాంట్లో యాభై వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు కట్టేందుకే సరిపోయిందని, అందులో ఇరవై వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసేది మీ కళ్లకు కనపడటం లేదా అని మండిపడ్డారు. గత పాలకులు హైదరాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా నటిస్తూ అనేక అక్రమాలకు తెరలేపారన్నారు. మూసీ ప్రక్షాళన మొదలు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. మీరు చేసిన పాపాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడిగే ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడిదన్నారు.