డీఎంహెచ్ఓ సాబ్ జర దేకో

ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం, మందులు అందుతాయని భావిస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతుంది. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక వైద్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2024-07-04 02:36 GMT

దిశ, ఉప్పల్ : ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం, మందులు అందుతాయని భావిస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతుంది. ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేక వైద్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ పీహెచ్ సీ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులకు ప్రసవమయ్యాక పడుకునేందుకు బెడ్లు లేక అవస్థలు పడుతున్నారు. లేబర్ రూమ్‌కు తలుపులు లేకుండా నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రాత్రి దొంగలు పడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

రూ.30 వేల నిధులు మంజూరు

ఉప్పల్ పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బన్నాల గీతాప్రవీణ్ జూన్ 11న ఆరోగ్య కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 వేలను పీహెచ్ సీలో మౌలిక వసతులకు వాడాలన్నారు. ఇది జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30వేలు లేబర్ రూమ్ తలుపులకు, ఇన్ పేషెంట్ బెడ్లకు ఉపయోగించకుండా దేనికి ఉపయోగించారని? ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News