ఘట్కేసర్ పీఎస్ వద్ద ఎంఐఎం ఎమ్మెల్సీ హల్చల్...

గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఎదురు దాడికి పాల్పడిన వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేక్ ఖాద్రి తన అనుచరులతో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేశారు.

Update: 2025-01-02 05:40 GMT

దిశ, ఘట్కేసర్ : గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఎదురు దాడికి పాల్పడిన వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేక్ ఖాద్రి తన అనుచరులతో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేశారు. బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి బహదూర్పురాకు చెందిన మహమ్మద్ ఉమర్ ఖురేషి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు నుంచి అంబర్పేటకు పశువులను తరలిస్తుండగా గో రక్షకులు అడ్డుకునే క్రమంలో ఘర్షణ జరిగింది. గో రక్షకులపై మహమ్మద్ ఉమర్ ఖురేషి మరి కొంతమంది ఎదురు దాడికి పాల్పడ్డాడు.

ఇరు వర్గాల కొట్లాటలో ఉమర్ ఖురేషి తలకు గాయాలయ్యాయి. గాయాలతో బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గోరక్షకుల పై చర్యలు తీసుకోవాలని అంటూ చెంగిచెర్ల కబేల ప్రాంతం నుంచి యువకులు, ఎంఐఎం నాయకులు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయకుండా పోలీస్ ఉన్నతాధికారులు చేరుకుని ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అర్ధరాత్రి ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేక్ ఖాద్రి పోలీస్ స్టేషన్ చేరుకుని గోరక్షకుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు స్టేషన్ లోనే బైఠాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గోరక్షకులు పవన్ రెడ్డి, వినయ్ లతో పాటు పలువురి పై కేసు నమోదు చేశారు.

గోరక్షకులకు మద్దతుగా మాజీ ఎంపీపీ...

గోరక్షకులకు మద్దతుగా ఘట్కేసర్ మాజీ ఎంపీపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి(వైయస్సార్) ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ చేరుకుని విషయం తెలుసుకున్నారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకోవడం తప్పా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని గోరక్షకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని కావాలనే ఎంఐఎం నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గో రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేకుండా ఎంఐఎం నాయకులకు భయపడుతోందని విమర్శించారు.

గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఎలా వదిలేసారని ప్రశ్నించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ గోవుల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్లుగా స్పష్టమవుతుందని విమర్శించారు. పోలీసు ఉన్నతాధికారుల ముందే పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడడం వందల మందితో పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ హల్ చల్ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. కాగా అప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్న పవన్ రెడ్డి, వినయ్ లపై ఎంఐఎం మూకలు ఎక్కడ దాడులు చేస్తారోనని అనుమానంతో గురువారం ఉదయం తెల్లవారుజాము వరకు పీఎస్ లోనే నిద్రించారు.


Similar News