ఇప్పట్లో బోర్డు ఎన్నికలు లేనట్లే
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడంలేదు.
దిశ, కంటోన్మెంట్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడంలేదు. నేడు, రేపు అంటూ ఊరిస్తూ వస్తున్న బోర్డు ఎన్నికలు ఈ ఏడాది లేనట్లేనని తెలుస్తోంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ దేశంలోనే 56 కంటోన్మెంట్ లకు మరోసారి ఏడాది కాలం పాటు నామినేటెడ్ సభ్యులను నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేయడంతో బోర్డు ఎన్నికల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాగా కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికల కోసం ఆశావహులు గత ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నారు.
ఐదేళ్లుగా నిరీక్షణే..
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలికి 2015, జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరిలో మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బోర్డు పరిధిలోని 8 వార్డులకు గాను ఎన్నికైన 8 మంది సభ్యులు తమలో ఒకరైన రెండో వార్డు సభ్యుడు సదాకేశవరెడ్డి బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తదనంతర రాజకీయ పరిణామాల వల్ల ఐదవ, ఒకటవ వార్డు సభ్యులైన జె.రామక్రిష్ణ, జక్కుల మహేశ్వర్ రెడ్డిలు ఉపాధ్యక్షులయ్యారు. అయితే మిలటరీకి చెందిన ఆంధ్రా, తెలంగాణ సబ్ ఏరియా కమాండర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
అయితే 2020 ఫిబ్రవరిలో ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. రక్షణ శాఖ ఎన్నికలు జరుపలేదు. అదే పాలక మండలిని ఆరు నెలలకొకసారి రెండు సార్లు ఉత్తర్వులు జారీ చేసి ఏడాది పాటు కొనసాగింది. ఆ తర్వాత 9 నెలల పాటు ఎన్నికలపై అనిశ్చితి కొనసాగింది. 2021, నవంబర్ లో ఇతర కంటోన్మెంట్లతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు కూడా సివిల్ నామినేటెడ్ సభ్యుడిగా మాజీ ఉపాధ్యక్షుడు జె. రామక్రిష్ణను నియమించారు. అప్పటి నుంచి నేటి వరకు రామక్రిష్ణనే నామినేటెడ్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఎన్నికలు లేనట్లేనా..?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీ లో విలీనం చేసేందుకు కేంద్రం ఒకవైపు కసరత్తు చేస్తోంది. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి స్థానిక పురపాలిక, నగరపాలికల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన విధి విధానాలను కూడా జారీ చేసింది. విటి ప్రకారం.. కంటోన్మెంట్ లోని సివిల్ ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో విలీనం చేస్తారు.
ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ అవుతాయి. మిలటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్ లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. అయితే జీహెచ్ఎంసీ పాలక మండలి ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది. అప్పటి వరకు కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేసి, జీహెచ్ఎంసీలో అంతర్భంగానే ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నేతల ఆశలపై నీళ్లు
బోర్డు ఎన్నికలు జరుగుతాయని లీకులు రావడంతో ఇటీవల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆశపడ్డారు. తమ తమ వార్డులలో యాక్టీవ్ పొలిటీషియన్లుగా మారిపోయి, సమాజ సేవకులుగా అవతారమెత్తారు. బోర్డు ప్రధాన కార్యాలయ అధికారులతో టచ్ లో ఉంటూ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు. బోర్డు ఎన్నికల ఓటరు జాబితాపై కసరత్తు చేశారు. మనకు మద్దతు తెలిపే వారి ఓట్లు ఉన్నాయా..? అని ఆరా తీశారు. కొందరు నేతలు వార్డులలో కలియ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బీజీగా గడిపారు.
గత ఏడాది డిసెంబర్ 31న బస్తీలలో కుర్రకారుతో దావత్ లు చేసుకున్నారు. అయితే మరోసారి నామినేటెడ్ సభ్యుడినే నియమించేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. అయితే ఈసారి ఎలాగైనా రామక్రిష్ణకు చెక్ పెట్టి నామినేటెడ్ బోర్డు సభ్యుడి పదవిని దక్కించుకోవాలని బీజేపీ నుంచి పలువురు కీలక నేతలు పావులు కదుతుపున్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తో సహా కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కలిసి తమకు నామినేటెడ్ సభ్యుడిగా అవకాశం ఇప్పించాలని కోరుతున్నట్లు తెలిసింది.