కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామ..
కోట్లాది రూపాయలు అందుకుని రాత్రికి రాత్రే బండి రమేష్ కు కూకట్పల్లి కాంగ్రెస్ టికెట్ కెటాయించడం అన్యాయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు అన్నారు.
దిశ, కూకట్పల్లి : కోట్లాది రూపాయలు అందుకుని రాత్రికి రాత్రే బండి రమేష్ కు కూకట్పల్లి కాంగ్రెస్ టికెట్ కెటాయించడం అన్యాయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టిముక్కల వెంగళరావు అన్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ టికెట్ బండి రమేష్‌కు కెటాయించడంతో వెంగళరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్టు ప్రకటించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గొట్టిముక్కల వెంగళరావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా నిరుత్సాహ పడకుండా ఎంత మంది హేళన చేసినా పార్టీ మారమని చెప్పి పార్టీని నమ్ముకుని ఉన్నానని అన్నారు. గతంలో జరిగిన ఎన్నికలలోను మూడు సార్లు స్థానికులకు టికెట్ ఇవ్వకున్నా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తూ అభ్యర్థుల కోసం పనిచేశానని అన్నారు.
పార్టీని నమ్ముకుని ఉన్నవారిని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి ఎన్నడు పని చేయని, కనీసం ఓటు వేయని వారికి, కాంగ్రెస్ కండువా ఎలా వేసుకోవాలో తెలియని వ్యక్తిని తీసుకు వచ్చి కోట్లాది రూపాయలు తీసుకుని రాత్రికి రాత్రే టికెట్ కెటాయించడం ఏందని ప్రశ్నించారు. బయటి వాళ్లకు టికెట్ కెటాయిస్తే క్యాడర్ దెబ్బతింటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటుందని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి ఎంపిగా పోటీ చేస్తున్నానని చెబితే కష్టపడి పనిచేసి ఎంపీగా గెలిపించుకున్నామని అన్నారు. టికెట్ ఇస్తానని రేవంత్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చూస్తానని, రెండు రోజుల తరువాత ఏ పార్టీలోకి వెళ్లాలో కార్యకర్తలతో చర్చించి చెప్తానని అన్నారు. రాజీనామ పత్రం పై సంతకం చేస్తు గొట్టిముక్కల వెంగళరావు కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్ సెల్ చైర్మన్ విశ్వతేజేశ్వర్ రావు, గూడెపు నాగరాజు, బషీర్, ఫణేందర్, రాజమల్లయ్య, గణేష్, బండారి ప్రవీణ్ గౌడ్, అరుణ్ గోవింద్, గురుమూర్తి, సునీల్, మహిళా నాయకులు రేష్మ, కృషవేణి, సంధ్య, కల్పన తదితరులు పాల్గొన్నారు