నిధులు లేక ప్రభుత్వ విభాగాలు పని చేయడం లేదు
అభివృద్ధి పనులకు సరిపడా నిధులు లేక జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు పనులు చేపట్టడం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
దిశ, కూకట్పల్లి : అభివృద్ధి పనులకు సరిపడా నిధులు లేక జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు పనులు చేపట్టడం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధులు లేక అభివృద్ధి పనులు జరగడం లేదని, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు ఏ పనులు చేయడం లేదని అన్నారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రజల బాగోగులు పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచి పోలేదని, హైదరాబాద్ మహా నగరాన్ని ప్రపంచంలోనే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల నిర్వహణకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేని పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు ఉన్నాయని అన్నారు.
గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళదామని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనతో ప్రజలు ఇప్పటికే విసుగెత్తి పోయారని అన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజేష్, సాయిబాబాచౌదరి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.