అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లు
అందరి భాగస్వామ్యంతో మేడ్చల్ జిల్లా అభివృద్ది పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : అందరి భాగస్వామ్యంతో మేడ్చల్ జిల్లా అభివృద్ది పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్ అవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తుందన్నారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన అర్హులైన వారికి లబ్ది చేకూరుతుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు.
అభయహస్తం పథకంలో భాగంగా జిల్లాలో అర్హులైన 74,457 మంది లబ్దిదారులకు సీలిండర్లను అందజేసినట్లు తెలిపారు. యాసంగి పంట కాలంలో 12 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ఒక లక్షా 40 వేల 471 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రూ.35 కోట్లను 2,554 మంది రైతులకు బ్యాంక్ ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలోని 2 లక్షల 33 వేల 515 మంది లబ్దిదారులకు ప్రతి నెలా 200 యూనిట్ల
వరకు విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. విద్యా, వైద్య, పరిశ్రమ రంగాలలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మహేందర్ రెడ్డి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి, డీసీపీ కోటి రెడ్డి, రెవెన్యూ అధికారి హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.
అలరంచిన నృత్యాలు..
‘సంఘటనం ఒక యజ్ఞం’ అనే పాటకు మేడ్చల్ జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల నృత్యా ప్రదర్శన అలరించింది. అలానే ‘ఇతిహాస్ కే మే అయినా హో ’ అనే పాటలకు ఎంజేపీ ఉప్పల్ విద్యార్థులు, ‘వందనాలు వందనాలు వీరులకు’ అనే పాటకు గవర్నమెంట్ హై స్కూల్, మౌలాలి విద్యార్థులు, ‘దేశ రంగీలా’అనే పాటలకు జిల్లా పరిషత్ హైస్కూల్ తూముకుంట విద్యార్థులు, ‘జయహో జయహో’ అనే పాటకు గుండ్ల పోచమ్మపల్లి విద్యార్థులు నృత్యాలతో ఆహుతులను కట్టిపడేశారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు..
కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ శాఖలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక విద్య ప్రాముఖ్యత తెలియజేసేందుకు పాఠశాల విద్యా శాఖ స్టాల్ ఏర్పాటు చేయగా, ఏ పంటలు.. ఏ సీజన్లో వేస్తే పంట దిగుబడి, అధిక లాభాలు వస్తాయో అవగాహన కల్పిస్తూ వ్యవసాయశాఖ ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ప్రజలు సద్వినియోగపర్చుకోవడానికి డీఆర్డీఏ స్టాల్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ, పౌర సరఫరాల శాఖ ప్రదర్శనలు ఏర్పాట్లు చేసి చూపరులను ఆకట్టుకున్నాయి.