సీఎంఆర్ కళాశాల వద్ద కొనసాగిన ఆందోళనలు
మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో గల సీఎంఆర్ కళాశాల వసతి గృహం బాత్రూంలో విద్యార్థినిలు ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు తీశారని జరుగుతున్న ఆందోళన గురువారం కూడా కొనసాగింది.
దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో గల సీఎంఆర్ కళాశాల వసతి గృహం బాత్రూంలో విద్యార్థినిలు ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు తీశారని జరుగుతున్న ఆందోళన గురువారం కూడా కొనసాగింది. ఉదయం నుండి సీఎంఆర్ కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ, ఎస్ఎఫ్ ఐ, ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు వసతి గృహం ముందు ఆందోళన కార్యక్రమాల నిర్వహించారు.
సీఎంఆర్ వసతి గృహ వార్డెన్ ప్రీతి విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఎవరో వీడియోలు తీశారని వార్డెన్ ప్రీతి దృష్టికి తీసుకెళ్లగా ఆమె విద్యార్థినులను తులనాడుతూ చులకనగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు ఝాన్సీ, రాథోడ్ సంతోష్ లు మాట్లాడుతూ సీఎంఆర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సీఎంఆర్ కళాశాల వసతి గృహాల్లో విద్యార్థినిలకు రక్షణ కరువైందని, ప్రభుత్వం వెంటనే సీఎంఆర్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వసతి గృహాన్ని పరిశీలించిన మహిళా కమిషన్ రాష్ట్ర కార్యదర్శి పద్మజ రమణ
సీఎంఆర్ ఐటీ బాలికల వసతి గృహంను మహిళా కమిషన్ రాష్ట్ర కార్యదర్శి పద్మజా రమణ పరిశీలించిన అనంతరం వసతి గృహంలో ఉండే విద్యార్థినుల స్టేట్ మెంట్ రికార్డు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే హాస్టల్ లో భద్రత లేకుండా పోయిందని, హాస్టల్ లో బాత్ రూమ్ కు వెళ్లిన విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీశారని, కండ్లకోయ్య సీఎంఆర్ ఐటీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని పద్మజ తెలిపారు. కళాశాల యాజమాన్యంకు నోటీసులు ఇచ్చామని, విద్యార్థులతో మాట్లాడటం జరిగిందని, మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు నివేదిక ఇచ్చి వారి ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ కార్యదర్శి పద్మజ తెలిపారు. ఈ విషయంపై స్పందించడానికి కళాశాల యాజమాన్యం నిరాకరించింది.
కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం ఉంది : మేడ్చల్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న వారి నుండి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను నిశితంగా పరిశీలించామని అందులో ఏ విధమైనటువంటి వీడియోలు లభించలేదని తెలిపారు. ఒకవేళ వీడియోలను డిలీట్ చేసినా సాంకేతికత సహాయంతో వాటిని తీసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సీఎంఆర్ కళాశాల బాలికల వసతి గృహం ఆవరణలో జరుగుతున్న సంఘటనలో సీఎంఆర్ విద్యాసంస్థల యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు.
విద్యార్థినులు ఉండే వసతిగృహం బాత్రూములకు వెనకాల అందులో పని చేస్తున్న వారికి గదులను కేటాయించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థినులతో చర్చలు జరిపిన సీఎంఆర్ విద్యా సంస్థల కార్యదర్శి గోపాల్ రెడ్డి వసతి గృహంలో చోటు చేసుకున్న సంఘటనలపై సీఎంఆర్ విద్యాసంస్థల కార్యదర్శి చామకూర గోపాల్ రెడ్డి విద్యార్థినులతో చర్చలు జరిపారు. విద్యార్థినుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీఎంఆర్ బాలికల వసతి గృహం వార్డెన్ ప్రీతి తొలగింపు
సీఎంఆర్ బాలికల వసతిగృహం వార్డెన్ ప్రీతిని సీఎంఆర్ యాజమాన్యం తొలగించింది. విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు విద్యార్థినిలను కించపరుస్తూ మాట్లాడినట్లు విద్యార్థినిలు ఆరోపించడంతో ప్రీతిని విధుల నుంచి యాజమాన్యం తప్పించినట్లు సమాచారం.