మల్లంపేటలో మరో భూ దందా..!

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలో మరో భూ దందా వెలుగులోకి వచ్చింది....

Update: 2024-07-08 02:26 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో:అప్పుట్లో ... మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో 65 విల్లాలకు అనుమతులు తీసుకుని ఓ నిర్మాణ సంస్థ ఏకంగా 260 విల్లాలు నిర్మించిన విషయం గుర్తుందా...? చెరువు శిఖం, బఫర్ జోన్ స్థలాలను అక్రమించి ఒకటి, రెండు కాదు శ్రీనివాస్ లక్ష్మి కన్‌స్ట్రక్షన్ అనే సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా 195 విల్లాలు నిర్మించి తెలుగు రాష్ట్రాలలోనే సంచలన సృష్టించింది. హైకోర్టు ఆదేశాలతో అప్పట్లో అధికార యంత్రాంగం 208 అక్రమ విల్లాలను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిలో100 విల్లాలను సీజ్ చేసింది. మిగితా విల్లాలను సైతం సీజ్ చేసినట్లే భావించాలని హెచ్చరిస్తూ.. నోటీసులు జారీ చేసి హడావిడి చేశారు. ఆ తర్వాత ఎక్కడికక్కడ ముడుపులు అందడంతో.. ఆ తర్వాత షరా మామూలైంది. ఇదంతా ఇప్పుడెందుకంటరా..? అదే సంస్థ గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ పేరిట మరో భారీ భూ అక్రమ దందాకు తెరలేపింది.

సర్కారు స్థలంలో విల్లాల నిర్మాణం..

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వే నెంబర్ 170/5 ఎక్ట్సెంట్ చూపుతూ సర్వే నెంబర్ 170/1 లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో శ్రీనివాస్ లక్ష్మి కన్‌స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మిస్తోంది. ప్రభుత్వ భూమిలో వైడ్ నంబర్ 002095/ హెచ్ఎండీఏ/0433/ఎంఈడీ/2023 పేరిట 2023, మే 4న 17 విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతులు పొందడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండడంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు 2024 మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అంతేగాక జాయింట్ సర్వే నిర్వహించి హెచ్ఎండీఏ అనుమతులు రద్దు చేయాలంటూ 2024 ఏప్రిల్ 15న దుండిగల్ తహశీల్దార్, హెచ్ఎండీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. ఇదంతా జరిగి మూడు నెలలైనా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

తగ్గేదెలే...

2021లో పంచాయతీ అధికారులను మ్యానేజ్ చేసి ‘విహానా వెంచర్స్’ గ్రూప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ పేరిట ఫోర్జరీ సంతకాలతో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సంస్థ యజమాని గుర్రం విజయలక్ష్మిపై అప్పట్లో పలు కేసులు నమోదయ్యాయి. అయినా విజయలక్ష్మి తీరు మారడం లేదు. గత ఫిబ్రవరి నెలలో కాలనీలోని పార్క్ స్థలాన్ని అక్రమించేందుకు జేసీబీ సాయంతో ఆట వస్తులను కూల్చేసి అడ్డువచ్చిన మహిళపై దాడులకు దిగడంతో కాలనీ వాసులు దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గుర్రం విజయలక్ష్మిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇదిలా వుంటే తాజాగా రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో తప్పుడు పత్రాలు సృష్టించి 17విల్లాలకు హెచ్ఎండీఏ‌లో అనుమతులు పొంది యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.

అక్రమ విల్లాలపై ఫిర్యాదు..

మల్లంపేట సర్వే నంబర్ 170/1 ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ 170/5లో హెచ్ఎండీఏ అనుమతులు పొంది 17 విల్లాలు నిర్మస్తున్నారంటూ వాటిని రద్దు చేయాలని బీజేపీ నాయకులు హెచ్ఎండీఏ అధికారులకు, మల్కాజ్‌గిరి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. 2021నుంచి 2023 వరకు పత్రిక కథనాల ద్వారా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీనివాస్ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కు ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతులు మంజూరు చేయడమేమిటని బీజేపీ నిజాంపేట అధ్యక్షుడు ఆకుల సతీష్ ప్రశ్నించారు. రూ.25కోట్ల విలువైన సర్కార్ భూమిని అక్రమించుకొని కబ్జా చేస్తున్న సదరు నిర్మాణ సంస్థకు,హెచ్ఎండీఏ మున్సిపల్, రెవెన్యూ అధికారుల తీరు విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న విల్లాలపై చర్యలు తీసుకోవాలని, సదరు నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సతీష్ డిమాండ్ చేస్తున్నారు.


Similar News