మాజీ ఎంపీటీసీ హత్య కేసును పోలీసులు నీరుగారుస్తున్నారు.. కుటుంబ సభ్యుల ఆరోపణ

మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో కుట్రదారులను పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని కేసును నీరుగారుస్తున్నారని గడ్డం మహేష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Update: 2024-07-03 12:01 GMT

దిశ, ఘట్కేసర్ : మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో కుట్రదారులను పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని కేసును నీరుగారుస్తున్నారని గడ్డం మహేష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో బుధవారం గడ్డం మహేష్ తల్లి మైసమ్మ, సోదరుడు విటల్, కుటుంబ సభ్యులు స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నెల 22వ తేదీన గడ్డం మహేష్ మిస్సింగ్ కేసు నమోదు అయినప్పటి నుంచి పోలీసుల వైఖరి పై అనుమానంగా ఉందని అన్నారు. గడ్డం మహేష్ హత్యకు గురయ్యాడన్న విషయం స్థానిక కౌన్సిలర్ బండారి ఆంజనేయులు ద్వారా తెలుసుకున్న తాము పోలీసులను అడిగితే తమకేం తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హత్య కేసులో నిందితులు లొంగిపోయారని విచారణ తర్వాత పూర్తివివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు ఏం చెప్పకుండా నిందితులను అరెస్టు చేశారన్నారు.

నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని పూర్తిస్థాయి (క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్) విచారణ చేసి వివరాలు చెబుతామన్న పోలీసులు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించకుండా నిందితులను రిమాండ్ కు పంపడం అనుమానంగా ఉందన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న గడ్డం మహేష్ ను అడ్డు తొలగించడం కోసం కడపోల్ల మల్లేష్ హత్యకు కుట్ర పన్నాడని ఆరోపించారు. హత్యకు కుట్ర పన్నిన కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ పై ఫిర్యాదు చేస్తే అతనికి రక్షణ కల్పించి లంచాలు తిని కేసు నీరు కారుస్తున్న ఘట్కేసర్ పోలీసుల పై సీఎం రేవంత్ రెడ్డికి, ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.


Similar News