ప్రభుత్వ బడుల్లో ఏఐ పాఠాలు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంచేందుకు తెలంగాణ సర్కారు కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ )ను పరిచయం చేసింది.

Update: 2025-03-15 14:07 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంచేందుకు తెలంగాణ సర్కారు కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ )ను పరిచయం చేసింది. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ గా మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలో తొలి విడతలో ఆరు స్కూళ్లను ఎంపిక చేయగా, శనివారం మరో రెండు స్కూళ్లలో ప్రారంభించింది. ప్రభుత్వ బడుల్లో మూడు, నాలుగు, ఐదవ తగరతి చదువుతున్న విద్యార్దులకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) పాఠాలను ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో ఏఐ టూల్స్, ప్లాట్ ఫాంలను రూపొందించారు.

ఏఐ విద్యకు ఏర్పాట్లు..

ఆధునిక సాంకేతికతను వినియోగించి విద్యను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో ఇప్పటికే 6 స్కూళ్లలో కోర్సును ప్రారంభించింది. ఆయా పాఠశాలల్లో సరిపడా కంప్యూటర్లను సిద్ధం చేసింది. కంప్యూటర్లతోపాటు హెడ్ ఫోన్స్, ఇంటర్నెట్ సదుపాయాలు ఇతర అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను సమాకూర్చింది. వారి పాఠశాలల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేసి ఎడ్యుటెక్ అధికారిత శిక్షణ అందించేందుకు ఉపాధ్యాయులను ప్రీపేర్ చేసింది.

    ఈ ప్రాజెక్ట్ తో విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఏఐ టెక్నాలజీ సహాయంతో వారు నేర్చుకునే విధానాన్నివిశ్లేషించి వారికి తగిన మార్గదర్శకత ఇవ్వనున్నారు. దీంతో ప్రభుత్వ విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థులతో పోటీపడే స్థాయికి చేరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 22 స్కూళ్లలో దీన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

బోధన విధానం ఇలా..

ప్రభుత్వ బళ్లకు వస్తున్న వారిలో 80 శాతం వరకు పేద విద్యార్థులు ఉంటారు. వారిలో సమాచార నైపుణ్యాలను పెంచేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను పరిచయం చేసేందుకు మెక్రో సాఫ్ట్​ ఫౌండేషన్ తెలుగు, ఆంగ్లం తెలిసిన వారితో పాఠాలు చెప్పిస్తోంది. ఆయా విద్యార్థులకు ఏఐ సంబంధించిన అంశాలను వివరించేందుకు వాలంటీర్లను సైతం ప్రోత్సహించనుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ బడుల్లో ఇప్పటికే వందల మంది సాప్ట్ వేర్ ఇంజనీర్లు విద్యార్థులకు ప్రతి శనివారం యానిమేషన్స్ గేమ్స్, కోడింగ్ అంశాలను నేర్పిస్తున్నారు. మరికొందరు ఆంగ్ల పదాలను సులువుగా నేర్చుకునేందుకు వస్తువులు, పరికరాలను తెచ్చి చూపిస్తున్నారు.

    ఈ క్రమంలోనే సాంకేతిక విద్యను అందించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో ఏఐ బోధన అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 3,4,5 తరగతుల వారిని ఐదుగురికి ఒక బ్యాచ్ గా ఏర్పాటు చేసి, ఒక్కో బ్యాచ్ కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలను బోధిస్తున్నామని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రవీందర్ రాజు చెప్పారు. ఇక పోతే ఏఐ పాఠాలను విద్యార్థి అర్ధం చేసుకుంటున్నారా..? లేదా అని ఏఐ గుర్తిస్తుంది. ఒకవేళ ఆ విద్యార్థి చెప్పే పాఠాలు అర్ధం కాకపోతే మరోసారి అర్ధమయ్యే రీతిలో బోధిస్తారు. అర్ధం అయిందంటే మరికొంత మెరుగైన పద్ధతిలో బోధన అందిస్తూ విద్యార్థి సులువుగా అర్ధం చేసుకునేలా ప్రయత్నాలు చేస్తారు.

పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది : విజయకుమారి, మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి


 మేడ్చల్ జిల్లాలో గత నెల 24వ తేదీన తొలి విడతలో 6 స్కూళ్లలో పైలెట్ ప్రాజెక్ట్ లో చేపట్టిన ఏఐ విద్యాబోధన సక్సెస్ అయ్యింది. ఈ నెల 15వ తేదీన శనివారం మరో రెండు స్కూళ్లలో ఏఐ పాఠాలు ప్రారంభించాం. జిల్లాలో 20 నుంచి 22 స్కూళ్లలో ఏఐ పాఠాలను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్నాం. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. వీలైనంత మంది ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఆధునిక నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కసరత్తు చేస్తున్నాం. 


Similar News