నర్సింగ్ హోమ్ నుంచి 8 బాలికను కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్
నర్సింగ్ హోమ్ నుంచి ఎనిమిది నెలల బాలికను కిడ్నాప్ చేసిన మహిళను మాదన్నపేట్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి బాలికను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దిశ, చంపాపేట్ : నర్సింగ్ హోమ్ నుంచి ఎనిమిది నెలల బాలికను కిడ్నాప్ చేసిన మహిళను మాదన్నపేట్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి బాలికను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాంపల్లి బోయిగూడ కమాన్ ఆగాపుర ప్రాంతానికి చెందిన ఫైజన్ అహ్మద్ సిద్ధిఖీ ఈ నెల రెండో తేదీన రాత్రి 8 గంటలకు తన భార్య, 8 నెలల కూతురు అమరియా సిద్ధిఖీ (8 నెలలు) తో కలిసి వినయ్ నగర్ కాలనీలోని నర్సింగ్ హోమ్‌కు మెడికల్ హెల్త్ చెకప్ కోసం వచ్చారు. అమరియా సిద్ధిఖీ తల్లి ఆసుపత్రిలోకి తీసుకెళ్లగా... అదే సమయంలో నర్సింగ్ హోమ్ సర్వెంట్‌గా పని చేస్తున్న కర్ణాటక గుల్బర్గా ప్రాంతానికి చెందిన న్యూస్ రత్ బేగం అలియాస్ షహనాజ్ (38) బాలికను తీసుకొని బయటకు వెళ్ళింది. అనంతరం తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో వాకప్ చేయగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు రాత్రి 9 గంటలకు మాదన్నపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణలో సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఇమ్లీబన్ బస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ బస్సులో ఎక్కుతుండడాన్ని గమనించి జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో జహీరాబాద్ పోలీసులు జహీరాబాద్ బస్టాండ్‌లో న్యూస్రత్ బేగం అలియాస్ షహనాజ్‌ను అదుపులోకి తీసుకొని మాదన్న పేట్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టగా గతంలో చనిపోయిన తన బాలిక జ్ఞాపకార్థం బాలికను కిడ్నాప్ చేసినట్లు విచారణలో తెలిసింది. దీంతో పోలీసులు మహిళను అరెస్టు చేసి బాలికను స్వాధీనం చేసుకొని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. తప్పిపోయిన బాలికను మూడు గంటల్లో పోలీసులు గుర్తించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.