బస్సు తప్ప.. అంతా తుస్సే : హరీష్ రావు

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బస్సు తప్ప అంతా తుస్సే అని ఎద్దేవా చేశారు.

Update: 2024-11-29 09:35 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బస్సు తప్ప అంతా తుస్సే అని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి మాజీ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఉద్యమం నాటి ఫొటో చిత్ర ప్రదర్శన ను నాయకులు తిలకించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమం నిర్వహించి స్వరాష్ట్రం సాధించారని గుర్తు చేశారు.

ఒక్క ఓటు రెండు రాష్ట్రాల పేరిట బీజేపీ, కామన్ మినిమమ్ ప్రోగ్రాం లో సంప్రదింపుల ద్వారా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని నమ్మ పలికి కాంగ్రెస్, ఎన్నికల ముందు జై తెలంగాణ.. ఎన్నికల తర్వాత నై తెలంగాణ అని తెలుగు దేశం పార్టీలు తెలంగాణ ప్రజలను వంచించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్సార్ సైతం తెలంగాణ రావాలంటే 100 కోట్ల ప్రజల ఆమోదం కావాలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అవహేళన చేశారని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం పదవులను గడ్డిపోచలాగా రాజీనామా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరాడితే, పదవులకు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన ఘనత నేటి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీ అని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమ కారులపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి చరిత్రను తెలంగాణ సమాజం మరిచిపోదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నత కాలం కేసీఆర్ చరిత్రను ఆనవాళ్లు ఎవ్వరు మలపలేరని స్పష్టం చేశారు.

హైడ్రా కూల్చివేతలు, లగచర్ల లో భూసేకరణ తదితర అంశాల్లో ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు గులాబీ సైనికులు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని హరీష్ రావు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, ఎఫ్ డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కుండం సంపత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి, అమర వీరుల స్థూపానికి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు.


Similar News