మా అమ్మ ప్రోత్సాహంతోనే.. ఐఏఎస్ అయ్యా

నా ఎదుగుదలలో మా అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది.

Update: 2024-03-11 15:53 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : నా ఎదుగుదలలో మా అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది. సివిల్స్ వైపు అడుగులు వేయడానికి చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇచ్చిన మోటివేషన్ గైడెన్స్ కారణమని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మను చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సమాజంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది కానీ ఎలాంటి వివక్ష చూపకుండా అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలను వారికి ఇష్టమైన అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు.

తల్లిదండ్రులు అమ్మాయిలకు ఆత్మ విశ్వాన్ని కల్పిస్తే పెద్దయిన తర్వాత అన్ని రంగాల్లో రానిస్తారన్నారు. నా భార్య వ్యక్తిగత జీవితంలో పిల్లలను చూసుకుంటూ వైద్య వృత్తిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్స్‌ను జిల్లా కలెక్టర్ సన్మానించారు. మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సరోజ, డీపీఓ దేవకీదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, సెట్విన్ అధికారి అమీనా, ఇతర శాఖల అధికారులు ఐసీడీఎస్ సీడీపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మను చౌదరి రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ధరణి పెండింగ్ అప్లికేషన్స్, భూసేకరణ, రానున్న లోకసభ ఎన్నికల సన్నద్ధత పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


Similar News