జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధులు అందజేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశ్రమల ప్రతినిధులను కోరారు.
దిశ, సంగారెడ్డి : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధులు అందజేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశ్రమల ప్రతినిధులను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు సీఎస్ఆర్ నిధుల జిల్లా పర్యవేక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కంపెనీ ఆక్ట్ మేరకు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను అందించి సహకరించాలన్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో స్థానికంగా కంపెనీ ఉన్న ప్రాంతానికి, జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయా కంపెనీలకు గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన ప్రాఫిట్ సీఎస్‌ఆర్ కింద జిల్లాలో వెచ్చించిన నిధులకు సంబంధించి వివరాలు అందించాలని తెలిపారు.
పరిశ్రమలు తమ నెట్ ప్రాఫిట్‌లో రెండు శాతం సీఎస్ఆర్ కింద నిధులు ఇవ్వాల్సి ఉంటుందని, కంపెనీ వారీగా ఇప్పటివరకు ఎంత ఇచ్చారు ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందన్నది ప్రతి సంవత్సరం వారి వివరాల నివేదికను సీఎస్ఆర్ నోడల్ అధికారులకు అందించాలని ఆమె సూచించారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో ప్రజల అవసరాలను గుర్తించి ఆ మేరకు సౌకర్యాలను కల్పించేందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ నగేష్, పరిశ్రమల శాఖ జిఎం ప్రశాంత్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ, జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.