Collector Valluri Kranthi : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం

Update: 2024-11-05 12:25 GMT

దిశ,అందోల్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్న రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకొవాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వహకులదేనని జిల్లా కలెక్టర్‌ వల్లూరి క్రాంతి అన్నారు. మంగళవారం అందోలు మండల పరిధిలోని డాకూరు, నాదులాపూర్‌ గ్రామాలలో సోసైటీ, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. నాదులాపూర్‌లో కేంద్రం వద్ద ధాన్యం ఉండడంతో ఎందుకు లిఫ్ట్‌ చేయలేదని నిర్వహకులను అడుగగా, వడ్లకు 18పైన తేమశాతం రావడంతో కొనుగోలు చేయలేదని బదులిచ్చారు. తేమ శాతం 17 కంటే తక్కువగా వస్తేనే కొనుగోలు చేయాల్సి ఉంటుందని, రైతులు నిబంధనలకు లోబడి తేమ శాతం వచ్చేలా అరబెట్టుకొవాలని ఆమె సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్‌మిల్లులకు పంపించాలని, అక్కడ కూడా వెంటనే అన్‌ లోడింగ్‌ జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం డాకూరు గ్రామ శివారులోని వరి కొత చేపడుతున్న హర్వేస్టర్‌ను పరిశీలించి, వరికొత సమయంలో మిషన్‌ ఆర్‌పీఎం 18 కంటే ఎక్కువగా ఉండేలా చూడాలని, తద్వారా ధాన్యంలో తాలు, చెత్త లేకుండా క్వాలిటీ ధాన్యం వచ్చే అవకాశం ఉంటుందని ఆమె రైతులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరేలా ఉపాధ్యాయులు ప్రజల్లో అవగాహనను కల్పించాలని కలెక్టర్‌ వల్లూరి క్రాంతి అన్నారు. నాదులాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యమైన, పోషక విలువలు కలిగిన భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు ఉపాధ్యాయుల విద్యా ప్రమాణాలు పై గ్రామస్తులకు అవగాహన కల్పించి, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆమె వెంట ట్రైనీ అదనపు కలెక్టర్‌ మనోజ్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారిణి జ్యోతి, అదనపు డీఆర్‌డీవో పీడీ జంగారెడ్డి, ఆర్‌డీవో పాండు, ఏడీఏ ప్రవీణ, ఏవో శ్రీహరి, ఏఈవో శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.


Similar News