ప్యారవరం బ్రిడ్జికు మోక్షం.. నెరవేరనున్న దశాబ్దాల కోరిక

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్యారవరం గ్రామ ప్రజల

Update: 2024-11-26 10:33 GMT

దిశ,ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్యారవరం గ్రామ ప్రజల దశాబ్దాల సమస్య వంతెన నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతనంగా బ్రిడ్జి నిర్మాణం కోసం పి ఆర్ ఆర్ (గ్రామీణ రహదారుల నిర్మాణం నిధుల) కింద రూ. 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. గతంలో దేవరంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న ప్యారవరం గత ప్రభుత్వం ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో సుమారుగా 650 జనాభా ఉంది. గ్రామానికి దశాబ్ద కాలం నుంచి వంతెన సమస్య తీవ్రంగా పీడిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగించేవారు.

వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం గ్రామస్తులు, యువకులు అనేక పోరాటాలు చేశారు. ఎట్టకేలకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం కోసం స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ప్యారవరం తో పాటు దేవరంపల్లి, ఈదులపల్లి, దిగ్వాల్, వెళ్లి వచ్చే ప్రజలకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు చిరకాల శాశ్వత సమస్య తీరనుంది. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేటట్లు అధికారులు, నాయకులు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాలకు చెందిన గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే బ్రిడ్జి సమస్యపై దిశ పలు మార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది.

టెండర్ పూర్తిగా గానే పనులు ప్రారంభం : శశిధర్ రెడ్డి,పీఆర్ ఏ ఈ ఝరాసంగం

ప్యారవరం గ్రామ వాగు పై నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన బ్రిడ్జ్ నిర్మాణం కోసం సి ఆర్ ఆర్ నిధుల కింద రూ. 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. టెండర్, డిజైన్ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తాం... వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిస్థాయి అందుబాటులు లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.


Similar News