అంబేద్కర్‌ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయం : ఎమ్మెల్యే

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు

Update: 2024-11-26 14:13 GMT

దిశ,దుబ్బాక : భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం 75వ భారత రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ వర్గాలకు.. విద్య, వైద్యం, ఉపాధితో పాటు సామాజికంగా ఉన్నత స్థితికి చేర్చేందుకు అనేక మహోన్నత కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు.

దేశానికే ఆదర్శం డాక్టర్‌ బీ.ఆర్ అంబేడ్కర్‌ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశానికే ఆదర్శం అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడ్డారని, పేదలకు ఆయన చేసిన కృషి మరువలేనిది అని తెలిపారు. అంబేడ్కర్‌ భారత రాజ్యాంగానికి రూపకల్పన చేయడమే కాకుండా, బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ల సౌకర్యం కల్పించిన మానవతావాది అని కొనియాడారు. ప్రపంచంలోని మేధావులలో కెల్లా గొప్ప మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని పేర్కొన్నారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని చూసి ఇతర దేశాల వారు అభినందించారని, అలాంటి వ్యక్తి మన దేశానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజక్క పేట మాజీ ఎంపీటీసీ, కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి, కరికే బీమా సేన, ఆస బాబు, బిట్ల వెంకటశ్వేర్లు, గుర్రాల శ్రీనివాస్, తహసీల్దార్ సంజీవ్ కుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News