ప్రెస్ క్లబ్ ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు చేస్తున్న ప్రెస్ క్లబ్ ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
దిశ, మెదక్ ప్రతినిధి : జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు చేస్తున్న ప్రెస్ క్లబ్ ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అసంపూర్తిగా ఉన్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణపు పనులకు రూ.15 లక్షలు మంజూరైన నేపథ్యంలో కలెక్టర్ రాజర్షిషా తో కలిసి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తరుణంలో జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో గతంలో రూ.20 లక్షలను కేటాయించామన్నారు. ఆ నిధులతో స్లాబ్ వరకు పనులు జరిగాయని, మిగితా పనులను పూర్తి చేసేందుకు అవసరమైన రూ.15 లక్షలను మంత్రి హారీష్ రావు సహకారంతో మంజూరు చేశామని తెలిపారు. అడిగిన వెంటనే అదనపు నిధులు కేటాయించిన మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రెస్ క్లబ్ కు అవసరమైన మరిన్ని నిధులను కేటాయించి అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించామని తెలిపారు, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం పనులను సైతం త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనానికి నిధులు మంజూరు చేయడం సంతోషరమైన విషయమన్నారు. జర్నలిస్టులు సమావేశాలు పెట్టుకునేందుకు తప్పకుండా భవనం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రెస్ క్లబ్ నిర్వహణకు షటర్స్ ఏర్పాటు చేసుకోవడం మంచి పరిణామం అని తెలిపారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం మంజూరు చేశామన్నారు. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బట్టి జగపతి, ఎంపీపీ యమున జయరామ్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ రాగి అశోక్, గౌరవాధ్యక్షులు కామాటి కృష్ణ, దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహ చారి, కోశాధికారి సంగమేశ్వర్, సలహాదారులు బివికే రాజు, వికాస్, గోపాల్ గౌడ్, రాజశేఖర్, సురేందర్ రెడ్డి, జర్నలిస్టులు లక్ష్మన్, సిద్దు, సందీప్, రాజాగౌడ్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, రహామత్ అలీ, పరుశురాం, కుమార్ గౌడ్, ప్రకాష్, నాగరాజు, గిరి, శ్రీకాంత్, శ్రీనివాస్, కార్తిక్, రఘు, అంజి, వంశీ తదితరులు పాల్గొన్నారు.