మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ.. ఆ నిర్మాణానికి లైన్ క్లియర్
గోపులాపూర్, కస్తూరి పల్లి చెక్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించుటకు అనుమతి లభించడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: గోపులాపూర్, కస్తూరి పల్లి చెక్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించుటకు అనుమతి లభించడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పేట మండలం గోపులాపూర్ గ్రామంలో రూ.1 కోటి 34 లక్షలు, చిన్నకోడూరు మండలం కస్తూరి పల్లిలో రూ.3.28 కోట్లతో నిర్మాణం కోసం ప్రభుత్వ హయాంలో అనుమతులు మంజూరు అయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాయగా పనులు ప్రారంభించాలని అనుమతులు వచ్చాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... చెక్ డ్యాం నిర్మాణ పనులు పూర్తయితే కస్తూరి పల్లి చెక్ డ్యాం ద్వారా సుమారు 200 ఎకరాలకు, గోపులాపూర్ చెక్ డ్యాం ద్వారా సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మాటిండ్ల శేఖర్ రావు పేట గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశించారు.