Lovers Suicide: హరిత హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డి పల్లి వద్ద ఉన్న హరిత రెస్టారెంట్‌లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దిశ, ఆందోల్: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డి పల్లి వద్ద ఉన్న హరిత రెస్టారెంట్‌లో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం మధ్యాహ్న సమయంలో హరిత రెస్టారెంట్‌లోని ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గదిని ఖాళీ చేయాల్సి ఉండగా, హోటల్ సిబ్బంది వెళ్లి డోర్‌ను తట్టారు. ఎంతసేపటికి డోరు తెరవకపోగా లోపల నుంచి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో అనుమానం వచ్చి, గదికి ఉన్న కిటికీలోంచి చూడగా ఆ ప్రేమ జంట ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. ఈ విషయాన్ని మునిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది రెస్టారెంట్‌లోని గది డోరును తీసి విగతా జీవులుగా ఉన్న వారిని పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు.
అయితే వీరు నారాయణఖేడ్ సమీపంలోని నిజాంపేట్ కు చెందిన వారుగా పోలీసులు చెబుతున్నారు. మృతుడు ఉదయ్ కాగా, మృతురాలి పేరు తెలియాల్సి ఉంది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి పెళ్లికి ఇరువురి కుటుంబాలు అడ్డు చెప్పడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరువురి కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు చెబుతున్నారు.