దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

మాయ మాటలు ఎన్ని రోజులు సాగవు.. దుబ్బాకలో ఏం కోల్పోయామో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-08 12:58 GMT

దిశ, మిరుదొడ్డి : మాయ మాటలు ఎన్ని రోజులు సాగవు.. దుబ్బాకలో ఏం కోల్పోయామో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తొగుటలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ఇన్ చార్జి బోడకుంట్ల వెంకటేశ్వర్లతో కలిసి మాట్లాడారు. నేడు మేము చేసిన పనులకు తాను చేసినట్లు దుబ్బాక ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నది మా ప్రభుత్వం ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. పనులు మా ద్వారానే జరుగుతాయన్న కనీస సోయి తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

మేము రోడ్డు వేస్తే వారు ఫొటోలు దిగుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో తొగుట మండల ప్రజల త్యాగాలు వెలకట్ట లేనివని, అందుకే ఇక్కడి అన్ని బీటీ రోడ్లు రిన్యూవల్ చేస్తున్నామని అన్నారు. నాడు కరువు మండలాల్లో దుబ్బాక నియోజకవర్గం ముందు వరుసలో ఉండేదని, నేడు మల్లన్న సాగర్ నిర్మాణంతో ఈప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే గా రఘునందన్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం చేసిందేమీ లేదన్నారు. తాము పార్లమెంట్ లో ఆందోళన చేశామని గుర్తు చేశారు.

బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చి ఉంటే కాలువ పనులు కూడా పూర్తి చేసుకునేవారమని తెలిపారు. మీరు గత రెండు మార్లు పార్లమెంటు ఎన్నికల్లో దుబ్బాక నుంచి భారీ మెజారిటీ అందించారని, మీ రుణం తీర్చుకోలేనిదన్నారు. సిద్దిపేట, గజ్వెల్ కు ధీటుగా అభివృద్ధి చేసుకుందామని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబం లెక్క అందరం కలిసి పని చేద్దామని, కార్యకర్తలకు అండగా ఉంటామని, వారికి ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భోజన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, భూంపల్లి మనోహరవరావు, సోలిపేట సతీష్ రెడ్డి, మామిడి మోహన్ రెడ్డి, వెంకటనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి. సొసైటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ కలీమోద్దీన్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంకణాల నర్సింలు, రైతుబంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, మార్కెట్ కమిటీ, సొసైటీ వైస్ చైర్మెన్లు కంది రాంరెడ్డి, కుర్మ యాదగిరి, ఎంపీటీసీ సుతారి లలిత రమేష్ తో పాటు సర్పంచ్ లు ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News