Collector : పోలీస్ అమరవీరుల త్యాగ ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి

అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని, ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అన్నారు.

Update: 2024-10-21 13:18 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని, ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో కలిసి నివాళులర్పించి ఎస్పీ ఉదయ్ కుమార్ తో కలిసి కలెక్టర్ శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ… పోలీసులు ప్రాణాలకు తెగించి ఎన్నో త్యాగాలు చేస్తూ వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. శాంతిభద్రతలను ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని శాంతి భద్రతల విషయంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారని అన్నారు. పోలీసు పాత్ర సమాజానికి చాలా ముఖ్యమని ప్రతి క్షణం ప్రజల అవసరాల గురించి నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు.

ప్రజల ధన, మాన రక్షణ గురించి నిరంతరం పని చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, పోలీసుల క్రమశిక్షణ భారతదేశ రక్షణ ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తరఫున ఎప్పుడు అండగా నిలుస్తామని తెలిపారు. పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ తో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల దినోత్సవం 21 అక్టోబర్ 1959 లో ఎస్ఐ కరీం సింగ్ 20 మంది జవాన్లు కలిసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారి పై దాడి చేసి 10 మందిని హత మార్చిందన్నారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచి ప్రారంభమై పోలీస్ ఫ్లాగ్ డే గా నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీసు అమరవీరుల ఫ్లాగ్ డే దినోత్సవం ముఖ్య ఉద్దేశం అమరులైన పోలీసుల జీవితాలనే మనం మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటూ ప్రజాసేవకు, ప్రజల ధన, మాన‌, ప్రాణాల రక్షణకు పునరంకితం కావడంమన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం‌, మతతత్వం వంటి విఛ్ఛిన్నకర శక్తులతో నేరాలకు గోరాలకు‌ పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తి మీద సాములాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించిందన్నారు.

ఈ దశలో త్యాగాలకు భయపడకుండా వెనకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించాలని తెలిపారు. పోలీసులు త్యాగం చేయని రోజు అంటు ఉండదని, సెలవులు, పండుగ దినాలు, అధిక గంటలు పని చేయాల్సి రావడం, అవిశ్రాంతంగా పని చేయడం వంటివి కూడా త్యాగాలే అని చెప్పారు. సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని అన్నారు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 21 నుండి 31 తేదీ వరకు రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ, 2 కే రన్, ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

పోలీస్ అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. మెదక్ జిల్లా పరిధిలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, సాయుధ దళ డీఎస్పీ రంగ నాయక్, ఆర్ ఐ శైలేందర్, జిల్లా సీఐ లు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐ లు అధికారులు, సిబ్బంది కలిసి పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆర్ఎస్ఐ మహిపాల్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ గౌరవ వందనం ఘనంగా నిర్వహించడం జరిగింది.


Similar News