స్వతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర..

భారత స్వతంత్ర ఉద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందని, పేద వర్గాల అభ్యున్నతి కోసమే పార్టీ పుట్టిందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు బట్టు దయానంద్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-26 08:49 GMT

దిశ, జగదేవపూర్ : భారత స్వతంత్ర ఉద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందని, పేద వర్గాల అభ్యున్నతి కోసమే పార్టీ పుట్టిందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు బట్టు దయానంద్ రెడ్డి అన్నారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల కావడంతో గురువారం జగదేవపూర్ మండలంలోని తిగుల్ లోని ఆరుట్ల భవనం ముందు సీపీఐ పార్టీ జెండాను ఎగురవేసి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీకి ప్రత్యేకత ఉందని, పేద వర్గాల కోసమే పార్టీ ఆవిర్భవించిందని వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా సీపీఐ పార్టీ ఉద్యమం చేసిందని, భూమిలేని పేదలకు భూమి అందించాలన్న లక్ష్యంగా పార్టీ పని చేసిందని పేర్కొన్నారు. ఎన్నో బూర్జువా పార్టీలు తమ స్వార్థం కోసం పనిచేశాయని ఆరోపించారు.

సీపీఐ అంటేనే ఓ చరిత్ర అని వివరించారు. రాజకీయాలలో పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు రావడం వల్ల నేడు రాజకీయాలు బ్రష్టు పడ్డాయని విమర్శించారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ కనుమరుగు అయిందని కొన్ని స్వార్థ పూరిత పార్టీలు ప్రచారం చేస్తున్నాయని, ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టు పార్టీలే రాజ్యమేలుతున్నాయని తెలిపారు. తెలంగాణలో సీపీఐ పేదల పక్షాన నిలబడి న్యాయం కోసం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నర్సింహరెడ్డి, గ్రామ కార్యదర్శి బిక్షపతి, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, నాయకులు మహేందర్ రెడ్డి, లింగం, కరుణాకర్ రెడ్డి, ఎల్లయ్య, బిక్షపతి, కృష్ణమూర్తి గ్రామస్థులు పాల్గొన్నారు.


Similar News