జిల్లాలో పెరిగిన క్రైమ్ : ఎస్పీ
జిల్లాలో నేరాల కేసులు పెరిగాయి.. రోడ్డు ప్రమాదాలు, మహిళపై వేధింపులు ఆస్తుల కోసం జరిగిన హత్యలు
దిశ, మెదక్ ప్రతినిధి : జిల్లాలో నేరాల కేసులు పెరిగాయి.. రోడ్డు ప్రమాదాలు, మహిళపై వేధింపులు ఆస్తుల కోసం జరిగిన హత్యలు, ప్రధానంగా సైబర్ నేరాలు కూడా గత యేడు కంటే ఈ సారి కూడా పెరిగినట్టు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా పోలీస్ వార్షిక నివేదిక వెల్లడించారు. మెదక్ జిల్లాలో 2023 లో 4187 కేసులు నమోదై 2024 లో 4871 లో 14.04 శాతం కేసులు పెరిగాయి. వీటిలో 26 హత్యకు గత యేడు జరగగా 2024 లో 28 హత్యలు జరిగాయి. ఆస్తి కోసం 13, కిడ్నాప్ కేసులు 41, అత్యాచారాలు 48 జరగనట్టు కేసులు నమోదయ్యాయి. దోపిడీలు 14, పగటి దొంగతనం 29, రాత్రి దొంగతనాలు 188, గొలుసు దొంగతనాలు 7, సాధారణ దొంగతనాలు 249, ఆలయాల్లో చోరీలు 26, ఆటో మొబైల్ దొంగతనాలు 179 జిల్లాల్లో జరిగాయి. సైబర్ నేరాల జిల్లాలో ఈయేడు భారీగా పెరిగాయి.
గతంలో పోలిస్తే ఈ యేడు జిల్లాలో బాధితుల సంఖ్య అధికంగానే ఉంది. 2023 లో రూ 2,19, 95,481 జరిగితే 2024 లో రూ 3, 36,54,826 సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. గత యేడు రూ 75.89 లక్షలు రికవరీ జరగగా 2024 లో రూ.1.22 కోట్ల రూపాయలు రీకవరి చేశారు. మహిళల పై నేరాలు 2023లో 331 కేసులు నమోదు కాగా 2024 లో 355 కేసులు నమోదయ్యాయి. ఇందులో భార్యల పై భర్తలు పాశవికంగా వ్యవహరించిన కేసులు 169 నమోదయ్యాయి. మహిళా కిడ్నాప్ కేసులు 37 జిల్లాలో జరిగాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన షీ టీమ్ లు 48 ఫిర్యాదులు రాగ 27 మందిపై కేసులు నమోదయ్యాయి. మహిళల రక్షణ కోసం జిల్లాల్లో 321 అవగాహన సదస్సులు నిర్వహించారు. భరోసా కేంద్రానికి 71 కేసులు నమోదు కాగా 86 మందిని అరెస్టు చేసి వీరిలో నలుగురికి శిక్ష కూడా పడింది. 22 లక్ష పరిహారం కూడా అందించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులు సైతం ఈ సారి పెరిగాయి. గతంలో 31 కేసులు ఉంటే ఈ సారి 48 కేసులు నమోదయ్యాయి. నాలుగు హత్య కూడా జరుగాయి. రోడ్డు ప్రమాదాలు గతయేడు తో పోలిస్తే స్వల్ప తేడా ఉన్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గింది.
2023 లో 562 రోడ్డు ప్రమాదాలు జరిగి 223 మంది మృత్యువాత పడ్డారు. 2024 లో 568 ప్రమాదాలు జరగగా 302 మృతి చెందారు. 459 మంది గాయాలపాలయ్యారు. పోలీస్ వాహనాల తనిఖీలో గతంలో పోలిస్తే ఈ సారి కేసులు కొద్దిగా తగ్గాయి. 2023 లో 2,88,456 కేసులు నమోదు చేయగా 2024 లో 2, 72,060 కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఈ సారి భారీగా పెరిగాయి. గతయేడు 4740 కేసులు నమోదు కాగా 10 మందికి శిక్ష పడింది, 2024లో 6563 కేసులు నమోదు చేయగా 11 మందికి శిక్ష పడింది. ఎన్ డి పి ఎస్ కేసులు 8 నమోదు చేసి 17 మందిని అరెస్టు చేసి వారి వద్ద 99 కిలోల గంజాయి పట్టుకున్నారు. 38 పేకాట కేసులు నమోదు చేసి రూ 9,70,082 లక్షలు సీజ్ చేశారు. జిల్లాలో 2023లో 344 మిస్సింగ్ కేసులు నమోదైతే 2024 లో 362 కేసులు నమోదు జరుగాయి. జిల్లాలో గతయేడు తో పోలిస్తే ఈ యేడు నేతల సంఖ్య పెరిగింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు : జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు అధిక సంఖ్యలో సాయంత్రం నుంచి రాత్రి పది గంటల మధ్య జరిగినట్టు గుర్తించామని చెప్పారు. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన రోజు రోడ్డు ప్రమాదాలు జరగడం లేదని తెలిపారు. ఇక మీదట అన్ని ప్రధాన ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. జిల్లాల్లో ఈ సారి సైబర్ నేరాలు పెరగడానికి అవగాహన లేకపోవడమే అన్నారు. చాలా వరకు అవగాహన సదస్సులు నిర్వహించిన సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.
సైబర్ మోసం జరిగిన వెంటనే1930 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, ఎలా చేస్తే రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాల్లో ఎక్కడ నేరం జరిగిన సమాచారం ఇచ్చిన 15 నిమిషాల్లో పోలీస్ లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లాలో కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్ల తో 60 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో క్రైమ్ శాతం తగ్గించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్బిఐ సందీప్ రెడ్డి, డి సి ఆర్ బి సి ఐ మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు