సైకోగా మారిన ఉపాధ్యాయుడు...

Update: 2024-12-02 08:46 GMT

దిశ, కొల్చారం : మండల కేంద్రమైన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి తోటి ఉపాధ్యాయులను విద్యార్థులను ఇష్టారీతిగా బూతులు తిడుతూ విద్యార్థులను కొడుతున్న వైనం సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంపత్ గత కొన్ని రోజులుగా తోటి ఉపాధ్యాయులను, విద్యార్థులను నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం పాఠశాలకు వచ్చిన గ్రామానికి చెందిన మేదరి నరసింహులు కుమారుడు అక్షిత్ కుమార్ ను రెండు చెవులు పట్టి పైకి లేపి కింద పడేయడంతో విద్యార్థి తరగతి గదిలోనే మూత్రం పోసుకొని అడ్డం పడిపోయాడు.

ఈ విద్యార్థి అక్షిత్ కుమార్ కు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అలాంటి విద్యార్థి పై నుండి కిందికి పడవేయడంతో విద్యార్థి స్పృహ కోల్పోయాడు. ఈ విషయమై తోటి ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే ఉపాధ్యాయులను సైతం బూతులు తిట్టడంతో విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వెంటనే సంబంధిత ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు పాఠశాల నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. విషయం తెలిసి కొల్చారం ఎంఈఓ సత్యనారాయణ రావు, కొల్చారం పాఠశాలకు చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులను నచ్చ చెప్పారు. ఉపాధ్యాయుని ప్రవర్తన పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


Similar News