ఆర్టీసీ బస్సు నుంచి జారిపడిన విద్యార్థిని.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా..

ఆర్టీసీ బస్సు నుంచి జారి బస్సు వెనుక చక్రం కింద పడడంతో విద్యార్థిని తీవ్ర గాయాల పాలైన సంఘటన మండల పరిధిలోని నార్సింగి బస్టాండ్ లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

Update: 2024-12-02 09:40 GMT

దిశ, పాపన్నపేట : ఆర్టీసీ బస్సు నుంచి జారి బస్సు వెనుక చక్రం కింద పడడంతో విద్యార్థిని తీవ్ర గాయాల పాలైన సంఘటన మండల పరిధిలోని నార్సింగి బస్టాండ్ లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నార్సింగి గ్రామానికి చెందిన బోడ రాజు కుమార్తె బోడ అఖిల పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది. రోజు మాదిరిగానే సోమవారం కళాశాలకు ఆర్టీసీ బస్సులో బయలుదేరగా ప్రమాదవశాత్తు ఆమె బస్సు నుండి కింద పడగా బస్సు వెనుక చక్రం విద్యార్థిని అఖిల కాలు పై నుండి వెళ్ళింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విద్యార్థులు పూర్తిగా బస్సులోకి ఎక్కక మునుపే డ్రైవర్ బస్సును కదిలించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థులు పేర్కొన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే అఖిల తీవ్ర గాయాల పాలైందని మండిపడ్డారు. నిత్యం ఇదే పరిస్థితి ఏర్పడుతుందని సమయానుగుణంగా బస్సులు రావడం లేదని, వచ్చిన బస్సులో ఫుడ్ బోర్డింగ్ చేస్తూ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలింపు..

అఖిల తొడ భాగం నుజ్జునుజ్జవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు ఈ విషయం తెలిపారు. పేద విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటనతో నార్సింగ్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆర్టీసీ బస్సుల పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పలుమార్లు హెచ్చరించిన దిశ..

మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునేందుకు వస్తారు. వారు ఉదయం పాఠశాల, కళాశాలకు వచ్చేందుకు.. సాయంత్రం ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు మెదక్ - బొడమట్పల్లి మార్గంలో సమయానుగుణంగా బస్సులు నడపడం లేదు. ఉన్న అరకొర బస్సులు సైతం సమయానుగుణంగా రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన బస్సు వెళ్ళిపోతే.. మళ్లీ బస్సు ఎప్పుడు వస్తుందో ఏమోనని.. దీంతో కళాశాల, పాఠశాలకు ఆలస్యం అవుతుందని విద్యార్థులు ఫుట్ బోర్డు పై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.


Similar News