Guinea stadium crush : రిఫరీ నిర్ణయంతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తొక్కిసలాట.. 56 మంది దుర్మరణం
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫరీ వివాదాస్పద నిర్ణయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫరీ వివాదాస్పద నిర్ణయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్క సారిగా తొక్కిసలాట చెలరేగడంతో 56 మంది మృతి చెందారు. ఈ ఘటన సౌత్ ఈస్ట్ గినియాలో సోమవారం చోటు చేసుకుంది. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన న్జెరెకోరెలో గినియా దేశ మిలిటరీ నాయకుడు మమాడీ డౌమ్‌బోయా గౌరవార్థం ఈ సాకర్ మ్యాచ్ నిర్వహించారు. రిఫరీ నిర్ణయం తర్వాత తీవ్ర అసహనానికి గురైన ఫ్యాన్స్ ఒక్క సారిగా రాళ్లురువ్వారు. దీంతో తొక్కిసలాట జరిగింది. 56 మంది మృతి చెందినట్లు ఆ దేశ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కనుచూపు మేరలో ఆస్పత్రి శవాలతో నిండిపోయింది. ఘటనపై గినియా దేశ ప్రధాన మంత్రి బా ఔరి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. హింసను ఖండించిన ఆయన సమన్వయం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.