‘దిశ’ కథనంపై స్పందించిన జిల్లా సబ్ రిజిస్ట్రార్..రికార్డుల పరిశీలన
ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు చేపడితే
దిశ, అందోల్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా రిజిస్టార్ అధికారిణి సుబ్బలక్ష్మి అన్నారు. ఈ నెల 18వ తేదీన దిశ దిన పత్రికలో ప్రచురితమైన ‘డబ్బులిస్తే చాలు...డాక్యుమెంట్‌లు రెడి–అక్రమ రిజిస్ట్రేషన్‌ల అడ్డగా జోగిపేట’ అనే కథనానికి ఆమె స్పందించారు. ఈ సందర్భంగా శనివారం జోగిపేటలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను, పత్రాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. పత్రికలో ప్రచురితమైన అందోలు మండలం పోసానిపేట శివారులోని జాతీయ రహదారికి అనుకొని ఉన్న భూమిలో 30, 31, 32, 33 ప్లాట్‌లుగా సృష్టంచి, గత నెల 13వ తేదీన 1132,1133,1134, 1135 డాక్యుమెంట్‌లు, వట్‌పల్లి మండలం గొర్రెకల్ శివారులోని 1121,1122, 1123 డాక్యూమెంట్‌లతో పాటు తదితర రిజిస్ట్రేషన్ పత్రాలను ఆమె పరిశీలించారు. వీటికి సంబంధించిన పూర్తి నివేదికను తనకు అందజేయాలని జోగిపేట సబ్ రిజిస్టార్ హబీబుద్దీన్‌ను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోగిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన రిజిస్ట్రేషన్‌లపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు దారులు సైతం ల్యాండ్ కన్వర్షన్ చేశారా, పంచాయతీ, హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లు ఉన్నాయా, ఎల్‌ఆర్‌ఎస్ చేశారా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతనే ప్లాట్‌లను కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. ఆమె కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న సమయంలో మీడియాను, బయట వ్యక్తులను ఎవరిని లోనికి అనుమతించకపోవడం గమనార్హం.