ఎస్సీ, ఎస్టీల చట్టాలు పక్కాగా అమలు చేయాలి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్..

ఎస్సీ, ఎస్టీ చట్టాలు పక్కాగా అమలు చేసి సమాజంలో గౌరవంగా జీవించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.

Update: 2024-09-28 15:15 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : ఎస్సీ, ఎస్టీ చట్టాలు పక్కాగా అమలు చేసి సమాజంలో గౌరవంగా జీవించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మెదక్ కలెక్టరేట్ లో శనివారం ల్యాండ్, అట్రాసిటీ కేసుల పై సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల చట్టాల పై అవగాహన కల్పించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీల పెండింగ్ కేసులు పరిష్కరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీల పై దాడులు అరికట్టాలని, బాధితులకు నష్ట పరిహారం త్వరిత గతిన అందించాలని కోరారు. ప్రతి నెలలో పౌర హక్కుల దినోత్సవం జరుపాలన్నారు. మెదక్ పట్టణంలో మున్సిపల్ కేటాయించిన ఎస్సీ, ఎస్టీ దుకాణ సముదాయాల పై దృష్టి సారించాలన్నారు. మెదక్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పున:ప్రతిష్టించాలని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహాల దాడులను సహించేది లేదన్నారు.

గౌతోజీగుడలో జరిగిన సంఘటనలో నిందితులను అరెస్టు చేయాలని, అక్కడ సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలన్నారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా వివక్ష కొనసాగడం బాధాకరం అన్నారు. కులం పేరుతో దూషించిన వాటికి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా జైల్ కు పంపాలని కోరారు. గ్రామాల్లో ఇరు వర్గాల మధ్య అసమానతలు పెరగకుండా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాలను పగడ్బందీగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం తరఫున విశేష కృషి చేస్తున్నట్లు, ఇందుకుగాను సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించి తద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రజల నుంచి వినతులు, దళిత సంఘాల సభ్యులు పలు అంశాల పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అన్ని సమస్యలను వారంలో పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణశంకర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ అభివృద్ధి అధికారి, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News