పెండింగ్ ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి : సిద్దిపేట కలెక్టర్
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో
దిశ, సిద్దిపేట ప్రతినిధి : దుబ్బాక శాసనసభ నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణం, భూసేకరణ పై ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణ పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, సర్వే అధికారులు చెరువులను పరిశీలించి చెరువు శిఖంలో పంటలు వేయకుండా చూడాలన్నారు.
అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దుబ్బాక నియోజకవర్గంలో వంగిన కరెంట్ పోల్స్, వంగిన వైర్స్, చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్స్ ను పరిశీలించి సరి చేయాలన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడి ఉన్నదని నియోజకవర్గంలోని రైతులకు ఇబ్బంది కలగకుండా సాగునీరు సరఫరా చేయాలని, నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి విద్య సంస్థలకు, ఆసుపత్రులకు, గ్రామ పంచాయతీలకు, గృహాలకు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, కాళేశ్వరం ప్రాజెక్టు యూనిట్ 1 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీత, ఇరిగేషన్ ఈఈ నారాయణ, ఎస్ఇ ఎలక్ట్రిసిటీ చంద్రమోహన్, డీఇ లు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.