హత్య కేసులో నిందితుల అరెస్ట్…
గత నెల 30న ఉదయం ఉత్తర్ పల్లి గ్రామ శివారులో సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకం
దిశ, సంగారెడ్డి అర్బన్ : గత నెల 30న ఉదయం ఉత్తర్ పల్లి గ్రామ శివారులో సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేయబడిన విషయం తెలిసిందే. అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే కట్టుకున్న భార్య, ఆమె ప్రియుడు కలిసి రాజును కత్తితో గొంతు కోసి చంపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య
సంగారెడ్డి పట్టణంలోని ఎల్ఐజి కాలనీలో నివాసం ఉంటున్న యం.రాజు (35), అతని భార్య సుమలత (32) కొండాపూర్ మండల పరిధి క్రౌన్ బీర్ ఫ్యాక్టరీలోని క్యాంటీన్ లో పని చేసేవారు. అదే క్యాంటీన్లో వంట మాస్టర్ గా ఉన్న రామస్వామి (38) తో సుమలతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరి విషయం భర్తకు తెలియడంతో అడ్డుగా ఉన్నాడని భావించి రాజుని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ముందుకు వేసుకున్న పథకం ప్రకారం సుమలత, రామస్వామిలు గత నెల 29న కంది మండలము ఉత్తరపల్లి గ్రామ శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ రాజుకి మద్యం తాగించి అతడు మత్తులోకి జరుకున్నాక తమ వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారే ఈ హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితుడైన రామస్వామి కంది మండలం కౌలంపేట గ్రామానికి చెందినవాడు కాగా, అతడికి భార్య ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సంగారెడ్డి రూరల్ ఎస్సై విద్యా చరణ్ రెడ్డి తెలిపారు.