సంగారెడ్డి మండలంలోనే అధిక మొత్తంలో అసైన్డ్ భూములున్నది ఫసల్ వాదీ గ్రామం. ఇంకేముంది రైతుల ఆర్థిక అవసరాలను కనిపెట్టిన రాజకీయ నాయకులు రైతులను మభ్య పెట్టి తక్కువ ధర చెల్లించి ఎక్కువ ధరకు రియలెస్టేట్ వ్యాపారులకు అమ్మేశారు. నేషనల్ హైవే గ్రామం పరిసర ప్రాంతం నుంచి వెళ్లడంతో భూములకు రెక్కలు వచ్చాయి. రాజకీయ నాయకులు దళారులను రంగంలోకి దింపి రైతులను నయానో.. భయానో బెదిరించి భూములు లాక్కుంటున్నారు. గ్రామంలోని అసైన్డ్ భూమి సర్వేనంబర్ 543, 548లో రైతుల నుంచి సుమారు 500 వందల పై చిలుకు ఎకరాల భూములను ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు దళారులు కమీషన్ బేస్ పై అగ్రిమెంట్ చేశారు. రైతులకు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రూ.30 లక్షలు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన నిర్వహించారు.
భూముల అన్యాక్రాంతం..
గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వాలు పేదలకు వారి జీవనోపాధి కోసం అసైన్డ్ భూములను పంపిణీ చేసింది. ఆ భూములను రైతులు సాగుచేసుకుని జీవనం కొనసాగించాలి. వాటిని అమ్మడం కాని, కొనడం కాని నిషేధం. కానీ కొందరు రాజకీయ దళారులు అసైన్డ్ భూములపై కన్నేశారు. ఎంతో కొంత ఇస్తాం మాకు భూములు విక్రయించండంటూ పేదల రైతుల నుంచి బలవంతంగా గుంజుకుంటున్నారు. ఇదంతా జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కూతవేటు దూరంలోని ఫసల్ వాదీ గ్రామంలో సర్వే నంబర్ 543, 548లో జరిగింది. సర్వేనంబర్ 543లో 471 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అదే విధంగా 548 సర్వేనంబర్ లో సుమారు 60 ఎకరాల వరకు అసైన్డు భూమి ఉంది. ఇందులో గ్రామంలోని పేదల కు అసైన్డ్ భూమిలో సాగు చేసుకునేందుకు లావుణీ పట్టాలను ప్రభుత్వం అందించింది. ఆ భూములను ఫసల్ వాదీ గ్రామ రైతులు సాగు చేస్తూ జీవినం సాగిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వ అవసరాల కోసం గత అధికార పార్టీ నాయకులు కొంత భూమిని బలవంతంగా రైతుల నుంచి తీసుకున్నారు. దీనిని అదనుగా భావించిన పేరు మోసిన రాజకీయ నాయకులు రైతుల వద్దకు వెళ్లి ఇది ప్రభు త్వం ఇచ్చిన భూమి, దీనిని ప్రభుత్వం తిరిగి గుంజు కుంటుందంటూ భయపెట్టారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.4 కోట్లకు పైనే పలుకుతు న్నది. భూమి పట్టాలు ఉన్న రైతులకు ప్రభుత్వం తీసుకుంటే డబ్బులు రావు, మాకు అమ్మండి మేము ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తామంటూ రైతులతో బేరాలకు దిగారు. ప్రభుత్వం తీసుకుంటే ఎలాంటి డబ్బులు రావని భయపడిన రైతులు వచ్చిందే లాభం అన్నట్లు రూ.30 లక్షలకు అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. రైతుల నుంచి తీసుకున్న భూములను ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు దళారులు కమీషన్ బేస్ పై అగ్రిమెంట్ చేశారు. అదే కాకుండా రైతుల భూములను వారికి సరేండర్ కూడా చేశారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను స్వాదీనం చేసుకున్న రియల్ వ్యాపారులు భూముల చుట్టూ కడీలు పాతారు. ఫసల్ వాదీ లోని అసైన్డ్ భూమి సర్వేనంబర్ 543, 548 లో రూ.30 లక్షలకు ఎకరా చొప్పున రూ.2వేల కోట్ల విలువ గల 500పై చిలుకు ఎకరాలను రాజకీయ దళారులు కొనుగోలు చేశారు. రైతుల భూములు సేకరించిన రాజకీయ నాయకులకు గత ప్రభుత్వంలోని పెద్దలు సహకారం అందించారు. ఇదే అదునుగా భావించిన దళారులు రైతులతో నేరుగా అగ్రిమెంట్లు చేయించుకున్నారు. కాగా ఎకరానికి రూ.30లక్షల చొప్పున అగ్రిమెంట్ చేయించుకుని కొందరికి మొత్తం డబ్బులు ఇవ్వకపోగా ఆ భూముల్లో రియల్ వ్యాపారులు కడ్డీలు పాతడంతో రైతులు మాకు డబ్బులు ఇవ్వకుండానే ఎలా కడ్డీలు పాతుతారంటూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన వల్ల అసైన్డ్ భూముల విషయాలు బయటకు పొ క్కాయి. భూమి లీజ్ అగ్రిమెంట్, డెవలప్ మెంట్ పేరుపై అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. జిల్లా అధికారులు, కలెక్టర్ వంటి అధికారులు ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా అగ్రిమెంట్ కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది.