ఎంత కాలం ఈ నిరీక్షణ.. ఎప్పటికి తీరును ఈ గోస..?
జహీరాబాద్ పట్టణ సమీపంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద
దిశ,జహీరాబాద్ : జహీరాబాద్ పట్ట ణ సమీపంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రయాణికుల రాకపోకలకు అనుకూలంగా చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)పనులు ఆరేళ్లుగా కొనసాగుతున్నాయి. నెల రోజుల్లోపు పూర్తి చేస్తామంటూ ఇటీవల పేర్కొన్నా అవి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నెపంతో రాకపోకలను నిషేధించారు. బైపాస్, ఇతర మార్గాల గుండా ట్రాఫిక్ మళ్ళించారు. నెల రోజులు గడిచినప్పటికీ పనులు పూర్తికాలేదు ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఇంకా ఎంతకాలం నిరీక్షించాలంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకిరువైపులా నిర్మించిన సర్వీస్ రోడ్లలో రాకపోకలకు ఇరుకు సందులగుండా ప్రయాణిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి క్రాస్ రోడ్డులో గల రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ప్రయాణికుల రాకపోకల కోసం ఆరేళ్ళ క్రితం డబుల్ లైన్ ఆర్వోబీ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రయాణికులు గతుకుల రోడ్లలో ప్రయాణించేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు.
నెలలు గడుస్తున్నా...
ఇదిలా ఉండగా నిధుల కొరత వల్ల ఎప్పటికప్పుడు పనులు తరచూ వాయిదా పడుతూ, కొనసాగుతున్నాయని కాంట్రాక్టు వర్గాలు పేర్కొంటున్నా.. నెల రోజుల్లో పూర్తి చేస్తామని చేసిన ప్రకటనలు నెరవేరలేదు.స్థానిక లెవల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్,సికింద్రాబాద్ ల నుంచి నాందేడ్,పూర్ణ,షిర్టీలకు, అదే విధంగా బెంగళూరు, తిరుపతి, కాకినాడ పట్టణాలకు ఎక్స్ ప్రెస్,ప్యాసింజర్,రైళ్ల , గూడ్స్ రైళ్ల రాకపోకలతో గేట్లు తరచు మూసేస్తుంటారు. స్థానికులతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలు వచ్చిన ప్రతీసారి కనీసం 20 నుంచి 30 నిమిషాలు పాటు గేటు వద్ద ఆగాల్సిందే. ఈ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో రూ.90 కోట్లుతో రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేసింది. బ్రిడ్జి పనులు 2018 ఆగస్టు 30న రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం పనులు చేపట్టారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల జాప్యంతోనే పనులు సకాలంలో పూర్తి చేయలేక పోతున్నట్లు ఆరోపణలున్నాయి. త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికుల రాకపోకలకు వీలు కల్పించాల్సిన అవసరం అధికారులు, కాంట్రాక్టర్ పై ఎంతైనా ఉంది.