వైభవంగా రథోత్సవం.. ముగిసిన సంబురం

లక్షలాది మంది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహాశివరాత్రి రోజు ప్రారంభమైన మహా జాతర మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-03-10 14:51 GMT

దిశ, పాపన్నపేట: లక్షలాది మంది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహాశివరాత్రి రోజు ప్రారంభమైన మహా జాతర మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా లక్షలాది మంది భక్తులు వనదుర్గామాతను దర్శించి తరించారు. పగలు, రాత్రి తేడా లేకుండా భక్తులు వన దుర్గమ్మ ను దర్శించుకున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఏడుపాయల క్షేత్రం కిక్కిరిసిపోయింది. మంజీరాలో పుణ్య స్నానాలు చేసి అమ్మ దర్శనానికి తరలి వెళ్లారు. తీరొక్క మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజులుగా సాగుతున్న మహా జాతర ఆదివారం ముగిసింది. ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన రథోత్సవం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథాన్ని మెదక్‌కు చెందిన చంద్ర భవన్ హోటల్ వారు బహుకరించారు. రంగురంగుల కలర్లతో రథాన్ని సుందరంగా తయారు చేయించారు. విద్యుత్ దీపాల కాంతులతో అత్యంత సుందరంగా అలంకరించి అందులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు.

రథం గోలి వద్ద నుంచి తాళ్లతో భక్తులు లాగుతూ.. వన దుర్గామాత ఆలయం ముందు వరకు రథయాత్రను కొనసాగించారు. వందల మంది భక్తులు తాడును లాగుతూ రథయాత్రను ముందుకు నడిపించారు. లక్షల మంది భక్తులు ఈ రథయాత్రను వీక్షించారు. రథాన్ని లాగుతూ ప్రతి ఒక్కరి నోటా వన దుర్గమ్మ నామ స్మరణలతో ఏడుపాయల కొండలు దద్దరిల్లాయి. అలా లక్షలాది మంది భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. రథోత్సవం ముగియడంతో కొందరు భక్తులు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. మళ్లీ దర్శించుకుంటాం తల్లి.. చల్లంగా చూడమ్మా.. వన దుర్గమ్మ తల్లి.. అంటూ వేడుకుంటూ ఇళ్లకు తిరుగు పయనమయ్యారు.



జాతరలో యువ సంద్రం..

యువత అధికంగా ఉన్న దేశం మనది. మన యువత కేవలం చదువుల్లోనూ, సాంకేతికంగానే కాకుండా భక్తిలో, ఆధ్యాత్మికతలో కూడా ముందుంటోంది. యువతీ యువకులతో కలకలలాడుతున్న మన దేశానికి యువతే అతిపెద్ద వనరు అని.. మనకన్నా సాంకేతికంగా ముందున్న ఎన్నో పాశ్చాత్య దేశాలు మన గొప్పతనాన్ని గుర్తించాయి. ఏడుపాయల మహా జాతరలో ఒకసారి పరిశీలిస్తే ఆ సంగతి స్పష్టమవుతోంది. ఏడుపాయల వన దుర్గమ్మ మహా జాతరలో ఎటు చూసినా యువజోరే కనిపించింది. కొందరు యువకులు అయితే జంట నగరాలు, హైదరాబాద్ నుంచి బైకులపై వచ్చి అమ్మను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతరలో వినోదాన్ని ఆస్వాదించారు. శనివారం రాత్రి ఏడుపాయలకు విచ్చేసిన బిత్తిరి సత్తి సందడి చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ పాలకమండలి చైర్మన్ బాలా గౌడ్, సభ్యులు, ఆలయ కార్యనిర్వాహణాధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది, ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Similar News