నేత్రపర్వంగా కేతకీలో రథోత్సవం
అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.
దిశ, ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 12: 00 గంటలకు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం నుండి రథోత్సవం వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకు వచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి రథంపై అధిష్టించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, ఢమరుక నాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం నయనానందకరంగా సాగింది. రాత్రి 3 గంటల వరకు రథం ఊరేగింపు కొనసాగింది. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి స్వయం పర్యవేక్షణలో ఝరాసంగం ఎస్సై రాజేందర్ రెడ్డి భారీ బందోబస్తు మధ్య ఉత్సవాలు ముగిశాయి.