ఆందోల్లో ముగిసిన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
ఆందోల్ లో ప్రసిద్ధిగాంచిన భూనీల సమేత రంగనాథ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
దిశ, అందోల్ : ఆందోల్ లో ప్రసిద్ధిగాంచిన భూనీల సమేత రంగనాథ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత నెల 25న ప్రారంభమైన ఉత్సవాలు శుక్రవారం రాత్రి స్వామివారి రథోత్సవ ఊరేగింపుతో ముగిశాయి. ఆలయంలో గణపతి హోమం, అభిషేకాలు, గరుడ హోమం, ద్వజారోహణం, యాగషాల, స్వామి వారి కళ్యాణోత్సవం వంటివి అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయానికి సంబంధించిన రుక్మిణి, సత్యభామ, సమేత చతుర్భుజ, మురళీకృష్ణుడి పంచలోహ విగ్రహాలు 1992 లో దేవాదాయ శాఖ వారు విలీనం చేసుకోగా, ఆ విగ్రహాలను మంత్రి దామోదర్ సహకారంతో తిరిగి రంగనాథ స్వామి దేవాలయానికి రప్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి పున ప్రతిష్టాపన చేశారు.
200 ఏండ్ల తర్వాత రథోత్సవం
ఆందోల్ లో ప్రసిద్ధిగాంచిన శ్రీ భూనీల సమేత రంగనాథ దేవాలయ రథోత్సవం సుమారుగా 200 ఏండ్ల తర్వాత చేపట్టారు. మంత్రి దామోదర్ సహకారంతో రూ.20 లక్షలతో 21 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం పెంటమల్లి గ్రామానికి చెందిన బాల బ్రహ్మచారి రథాన్ని తయారు చేశారు. చాలా ఏండ్ల తర్వాత స్వామివారి రథోత్సవ ఊరేగింపు జరగడంతో వేలాదిమంది భక్తజనం తరలివచ్చారు. రథం వద్ద పెద్ద ఎత్తున అన్ని కులాలకు చెందిన వారి కలయికతో పూజలు నిర్వహించారు. అన్నం వండి రథం ముందు పెద్ద కుప్ప(రతి)గా పోశారు. మంత్రి దామోదర్ -పద్మిని, ఆయన కూతురు త్రిష- మణికంఠ దంపతులు రథం వద్ద పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు.
మహిళలు రథం ఇరువైపులా మంగళహారతులు పట్టుకొని రథోత్సవ ఊరేగింపులో ముందుకు కదిలారు. రథాన్ని తాళ్లతో భక్తులు భక్తిశ్రద్ధలతో ముందుకు లాగారు. జై శ్రీమన్నారాయణ.. జైజై శ్రీమన్నారాయణ అంటూ భక్తులు నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. స్వామి వారి భక్తి పాటలు అలరించాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన రథోత్సవ ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా తెల్లవారుజామున స్వామివారి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పద్మనాభరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్. సురేందర్ గౌడ్, రంగ సురేష్, ఆకుల చిట్టిబాబు, డాకూరి శివశంకర్, భవాని నాగరత్నం గౌడ్, హరికృష్ణ గౌడ్, నాగరాజు (నాని), మాజీ కౌన్సిలర్ ప్రదీప్ గౌడ్, నాయకులు డాకూరి వెంకటేశం, శరత్ బాబు, రామకృష్ణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.