ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నాకే అవమానం..!

మెదక్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ అయిన నాకే అవమానం జరిగింది, సామాన్యులకు న్యాయం జరిగేనా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-09-28 10:24 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ అయిన నాకే అవమానం జరిగింది, సామాన్యులకు న్యాయం జరిగేనా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై దళితులు జిల్లాలో ఎదుర్కుంటున్న సమస్యలు అడిగి తీసుకున్నారు. అనంతరం కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో సాక్షాత్తు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అయిన నాకే అవమానం జరిగిందని చెప్పారు. మెదక్ ఉమ్మడి జిల్లాలో జరిగే సమీక్షలతో ప్రోటోకాల్ ఉందని, కానీ జిల్లాలో జరిగే ఏ సమీక్షకు జిల్లా నుంచి ఆహ్వానం అధికారుల నుంచి రావడం లేదన్నారు.

సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి తనకు సమాచారం వస్తుందని కానీ మెదక్ జిల్లా నుంచి మాత్రం రావడం లేదని చెప్పారు. ఇటీవల జరిగిన మంత్రి కొండా సురేఖ సమీక్షకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు సమాచారం ఇచ్చి వచ్చినా కనీసం ఆహ్వానించకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం స్టేజీ పైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ పేరు బోర్డు కూడా లేకపోవడం అవమానకరమే అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ లో భాగంగా ఆహ్వానించాలని, కానీ జిల్లా అధికారులు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తర్వాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కే ప్రోటోకాల్ ఉంటుందన్న విషయం అధికారులు విస్మరించడం బాధాకరం అన్నారు. 78 ఏళ్ల తర్వాత కూడా తనలాంటి వారికే అవమానం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు తీరు మార్చుకోవాలని చెబుతున్నానని అన్నారు.


Similar News