సంక్షేమ స్కూల్ లో అత్యవసర పనులకు ప్రతిపాదనలు
జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు పునః ప్రారంభ నాటికి అత్యవసర మరమ్మతుల పై ప్రతిపాదనలు సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు

దిశ, మెదక్ ప్రతినిధి : జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు పునః ప్రారంభ నాటికి అత్యవసర మరమ్మతుల పై ప్రతిపాదనలు సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలల సంక్షేమ శాఖల, జిల్లా అధికారులతో పాఠశాలలు పునః ప్రారంభానికి అత్యవసరం మరమ్మతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖను బలోపేతం చేసే దిశగా నాణ్యమైన గుణాత్మక విద్య అందించే దిశగా కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులు కల్పిస్తుందని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన అత్యవసర మరమ్మతులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.
అత్యవసర మరమ్మతులలో మరుగుదొడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీరు సమస్య పై దృష్టి సారించాలని, రూప్ లీకేజీ, ప్లంబింగ్, డోర్స్ ,విండోస్ మరమ్మత్తులు చేయించాలన్నారు. అద్దె ప్రాతిపదికన నడుస్తున్న సంక్షేమ పాఠశాలలు వసతి గృహాల బిల్డింగ్స్ ఓనర్ తో మాట్లాడి మరమ్మతులు, మరుగుదొడ్లు, పూర్తి చేసి, విద్యార్థులకు ఉపయోగం లోకి తీసుకురావాలన్నారు. వసతి గృహాలు, పాఠశాలల్లో సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత సీనియర్ అధికారికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, ఎస్సీ సంక్షేమ అధికారి చంద్రకళ, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, సంబంధిత గురుకులాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.