వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీస్ కేసులా.. హరీష్ రావు ఫైర్

దేవుళ్ళ పై ఒట్టేసి రుణమాఫీ దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి రైతలను మోసం చేయడం ఓ లెక్కా కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు.

Update: 2025-03-25 14:05 GMT
వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీస్ కేసులా.. హరీష్ రావు ఫైర్
  • whatsapp icon

దిశ, మెదక్ ప్రతినిధి :  దేవుళ్ళ పై ఒట్టేసి రుణమాఫీ దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి రైతలను మోసం చేయడం ఓ లెక్కా కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రంలో ముస్లింల కు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. అంతకు ముందు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తుందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు అనుమతించడం లేదన్నారు. సమస్యల కోసం పోరాటం చేస్తున్న ఆశా వర్కర్లను సొమ్మసిల్లేలా పోలీసులతో కొట్టించారని అవేదన వ్యక్తం చేశారు. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులను అణించివేశారన్నారు. రైతాంగానికి మాఫీ చేస్తామని ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ మీద ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ అయినవాళ్లు తక్కువ, కాని వాళ్లు ఎక్కువ మంది ఉన్నారని, 6 నెలలైనా ఇప్పటికీ అందరికీ మాఫీ కావడం లేదన్నారు.

రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రైతులను మోసం చేశాడని, దేవుళ్లనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేసుడు ఓ లెక్కా కాదన్నారు. రాష్ట్రంలో అడుగడుగునా దగా కొనసాగుతుందని, అక్కా చెల్లెళ్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేయకుండా దగా చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని దగా చేశారన్నారు. అసెంబ్లీలో మేం అడుగుతుంటే ప్రతి దాడులు చేస్తున్నరని, కనీసం సమాధానం ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తి వేశారని చెప్పారు. రెండు లక్షల పై ఉన్న వారు డబ్బులు చెల్లిస్తే వెంటనే రుణ మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదని, రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని చెప్పారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.

వానకాలం రైతుబంధు ఎగ్గొట్టిందని, యాసంగి కూడా పూర్తిగా ఇవ్వడం లేని, ఊరించి, ఊరించి చేస్తున్నారన్నారు. డబ్బులు లేవంటూ బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం ఇచ్చేస్తూ చిన్న కాంట్రాక్టర్ లకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారాన్నారు. 14వేల కోట్లు రైతుబంధు డబ్బులు ఉండవు, రిటైరైన ఉద్యోగులకు డబ్బులివ్వమంటే ఉండవు, 25వ తారీఖు వరకు అంగన్వాడీలకు జీతాలు పడవు కానీ 1వ తారీకునే జీతాలిస్తామని చెబుతున్నారన్నారు. ప్రభుత్వం మాటల్లో మాత్రమే పని చేస్తుందని, చేతల్లో మాత్రం డబ్బుల్లేవంటున్నారన్నారు. రూ 20 వేల కోట్లతో హెచ్ఎండీఏలో టెండర్లు ఎట్లా పిలుస్తున్నారని ప్రశ్నించారు. 15 వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ టెంటర్లు, రూ. 7 వేల కోట్లతో జీహెచ్ఎంసీలో టెండర్లు ఎలా పిలుస్తున్నవని సీఎం ను ప్రశ్నించారు. నీ భూములున్న మీ అత్తగారిల్లు ఆమన్ గల్ కు 5 వేల కోట్లతో 10 లైన్ల రోడ్డు ఎలా వేస్తున్నావని నిలదీశారు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటామని, రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ను బీ అర్ ఎస్ నిలదీస్తూనే ఉంటామన్నారు.

దిగజారి సర్కారు పనితీరు : మధుసూదన చారి

రాష్ట్రంలో సర్కారు పనితీరు మరి దిగజారుతుందని మాజీ స్పీకర్ మధుసూదన చారి ఆరోపించారు. కాంగ్రెస్ గతంలో పాలించిన చరిత్ర ఉందన్న నమ్మకం తో ఇచ్చిన హామీలపై భరోసా తో అధికారం అప్పగిస్తే ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. మాట తప్పం మడిమ తిప్పము అని చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. సాంకేతిక పరమైన అంశం పైనే సభ సాగుతుందని తప్ప సభలో ప్రజల శ్రేయస్సే లేదన్నారు. ఇంత దిగజారిన విధంగా సభ కొనసాగడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు రోజులు సభ సాగితే రెండు రోజులు కూడా సక్రమంగా చర్చ సాగడం లేదని, ప్రశ్నావళి రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నియంత పాలన సగలేదని అన్నారు. ప్రజానీకానికి సాగు, తాగు నీరు, కరెంటు సమస్యల పరిష్కారం జోలికి వెళ్లి పరిష్కరించాలన్నా భావన ప్రభుత్వంలో లేదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, తిరుపతి రెడ్డి, బట్టి జగపతి, లావణ్య రెడ్డి తో పాలు పలువురు నాయకులు పాల్గొన్నారు.


Similar News