దిశ ఎఫెక్ట్ : ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్
రైతు బీమా డబ్బుల స్వాహా లో ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శుల పై అధికారులు వేటు వేశారు.

దిశ, మెదక్ ప్రతినిధి: రైతు బీమా డబ్బుల స్వాహా లో ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శుల పై అధికారులు వేటు వేశారు. బతికి ఉన్న వ్యక్తులకు మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ మండలం గిట్టకింది పల్లి లో శ్రీనివాస్, మల్లేష్ లు బతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు. ఇందులో ఒక కార్యదర్శి ప్రభాకర్ మృతి చెందగా కాస నరేందర్ ప్రస్తుతం అదే గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. మనిషి బ్రతికి ఉన్నప్పుడే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన వ్యవహారం లో దిశలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలంగా విధులకు హాజరు కావడం లేదు. ఓ రాజకీయ నేత సహకారంతో బతికి ఉండగానే తప్పుడు డెత్ సర్టిఫికెట్ ఇచ్చి రైతు బీమా సొమ్ము కాజేసిన వైనంలో కార్యదర్శి ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ కేసు కొనసాగుతుంది. అయితే క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా కార్యదర్శి నరేందర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. అలాగే హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి లో లెంక మల్లేశం బతుకు దెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేదు. కానీ మల్లేశం మృతి చెందినట్టు తప్పుడు డెత్ సర్టిఫికెట్ కుటుంబీకులు తీసుకున్నారు. విచారణ జరపకుండా మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన అప్పటి బూరుగుపల్లి కార్యదర్శి పని చేసి ప్రస్తుతం బ్యాతోల్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని డీపీఓ యాదయ్య తెలిపారు. రెండు గ్రామాల్లో ముగ్గురి కి బతికి ఉండగానే తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన వ్యవహారంలో జిల్లా అధికారులు చర్యల పై జాప్యం నెలకొన్న వైనంపై దిశ పత్రికలో ఇక్కడ తప్పు ఓప్పే అన్న కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇందుకు స్పందించిన జిల్లా అధికారులు ఇద్దరి కార్యదర్శుల పై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.